లక్నో: ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతి మేనల్లుడు ఆకాష్ ఆనంద్‌ను రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎ) చీఫ్ రాందాస్ అథావాలే (Ramdas Athawle) తన పార్టీలోకి ఆహ్వానించారు. బీఎస్పీ నుంచి బహిష్కృతుడైన ఆయన చేరితే తమ పార్టీ యూపీలో మరింత బలపడుతుందని తెలిపారు. ‘ఆయన (ఆకాష్ ఆనంద్) బాబా సాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లాలనుకుంటే, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాలో చేరాలి. ఆయన (ఆకాష్ ఆనంద్) పార్టీలో చేరితే, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా యూపీలో మరింత బలపడుతుంది’ అని అన్నారు.
కాగా, తన రాజకీయ వారసుడిగా ప్రచారం జరిగిన మేనల్లుడు ఆకాష్ ఆనంద్‌ను బీఎస్పీ నుంచి మాయావతి సోమవారం బహిష్కరించింది. దీనికి ముందు పార్టీలోని అన్ని పదవుల నుంచి ఆయనను తప్పించింది. పార్టీ జారీ చేసిన షోకాజ్ నోటీస్‌కు ఆకాష్ ఆనంద్ ఇచ్చిన ప్రతిస్పందన ‘స్వార్థపూరితమైనది, అహంకారపూరితమైనది’ అని ఆమె ఆరోపించారు. బాబాసాహెబ్ డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ ఆత్మగౌరవం, ఉద్యమ ప్రయోజనాల దృష్ట్యా, కాన్షీరామ్ క్రమశిక్షణా సంప్రదాయాన్ని అనుసరించి, మామ అశోక్ సిద్ధార్థ్ ప్రభావంలో ఉన్న ఆకాష్ ఆనంద్‌ను పార్టీ నుంచి బహిష్కరించినట్లు మాయావతి పేర్కొన్నారు.