లక్నో : అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామ మందిర ప్రారంభోత్సవానికి (Ram Temple Inauguration) తనకు ఆహ్వానం అందలేదని శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే చేసిన వ్యాఖ్యలపై శ్రీ రామ జన్మభూమి ఆలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ స్పందించారు. జనవరి 22న జరిగే రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టకు కేవలం రామ భక్తులకు మాత్రమే ఆహ్వానాలు పంపారని చెప్పారు.
రాముడి పేరుతో బీజేపీ రాజకీయ రణరంగంలో పోరాడుతోందని అనడం తప్పని అన్నారు. మన ప్రధానిని ఎక్కడికి వెళ్లినా అందరూ గౌరవిస్తున్నారని, ఆయన కష్టపడి పనిచేస్తున్నారని ఇది రాజకీయం కాదు..మోదీ అంకితభావానికి దక్కిన గౌరవమని చెప్పుకొచ్చారు. కాగా రామాలయ ప్రారంభోత్సవానికి తనను ఆహ్వానించకపోవడంపై ఇటీవల ఠాక్రే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని రాజకీయం చేయరాదని, ఈ కార్యక్రమం రాజకీయాలకు వేదిక కారాదని, కేవలం ఓ పార్టీ చుట్టూ తిరగడం తగదని పేర్కొన్నారు. రామాలయ ప్రారంభోత్సవం పట్ల తాను ఎంతో సంతోషంగా ఉన్నానని, దీని కోసం తన తండ్రి చేసిన పోరాటాన్ని ఠాక్రే గుర్తుచేశారు.
Read More :