న్యూఢిల్లీ: శ్రీరామనవమి (Sri Rama Navami) గడిచి రెండు రోజులైనా పలు రాష్ట్రాల్లో ఉద్రిక్త పరిస్థితులు సద్దుమనగలేదు. నవమిరోజున మహారాష్ట్ర, గుజరాత్, పశ్చిమబెంగాల్, బీహార్‌లో ఘర్షణలు చోటుచేసుకున్నాయి. దీంతో బీహార్ (Bihar), పశ్చిమబెంగాల్లోని (West Bengal) పలు జిల్లాల్లో పోలీసులు 144 సెక్షన్ (144 Section) విధించారు. ఇక గుజరాత్ (Gujarat), మహారాష్ట్రల్లో (Maharashtra) అల్లర్లతో సంబంధమున్న వారిని అరెస్టు చేస్తున్నారు. బీహార్‌లోని ససారామ్ (Sasaram), నలందా (Nalanda) జిల్లాల్లో రెండు వర్గాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. దీంతో ఆయా ప్రాంతాల్లో శాంతి భద్రతలను పరిరక్షించేందుకుగాను పోలీసులు 144 సెక్షన్ విధించారు. ప్రజలు గుంపులుగుంపులుగా బహిరంగ ప్రదేశాల్లో తిరగొద్దని హెచ్చరించారు.
ఇక గుజరాత్‌లోని వడోదరాలో రామనవమి సందర్భంగా రాళ్లు విసిరిన ఘటనతో సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 24 మంది పోలీసులు అరెస్టు చేశారు. అదేవిధంగా మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో రెండు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. పరస్పరం రాళ్లదాడి చేసుకున్నారు. అల్లరిమూకలు వాహనాలకు నిప్పంటించారు. ఘర్షణల్లో 12 మందికి గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు 500 మందిపై పోలీసులు కేసులు నమోదుచేయగా, 21 మందిని అదుపులోకి తీసుకున్నారు.
బెంగాల్‌లోని హౌరా జిల్లాలో రామనవమి వేడుకల సందర్భంగా ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో అల్లరి మూకలు పలు వాహనాలను ధ్వంసం చేయడంతో పాటు దుకాణాలను లూటీ చేశాయి. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే 31 మందిని అరెస్ట్ చేశామని అధికారులు చెప్పారు. దల్కోల ప్రాంతంలో జరిగిన ఘర్షణలో ఓ వ్యక్తి మరణించగా పలువురికి గాయాలయ్యాయి. మూకలను చెదరగొట్టడానికి పోలీసులు టియర్‌గ్యాస్ ప్రయోగించారు. ఈ నేపథ్యంలో హౌరాలోని శివ్‌పూర్‌లో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేశారు. 144 సెక్షన్ అమలుచేస్తున్నారు.
కాగా, ప్రశాంతంగా ఉన్న బెంగాల్లో చిచ్చుపెట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నదని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. నవమి సందర్భంగా రాష్ట్రంలో అల్లర్లు సృష్టించడానికి ఆ పార్టీ మూడు నెలల ముందే ప్రణాళికలు రచించిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. హౌరాలో జరిగిన అల్లర్లకు బీజేపీయే కారణమని మండిపడ్డారు.