Ayodhya | అయోధ్య రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ఠకు సమయం దగ్గరపడుతున్నది. మరో వైపు ఆలయంలో ప్రాణ ప్రతిష్ఠ వేడుక కోసం ఆలయంలో పూజా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. మరో వైపు ప్రముఖలకు ట్రస్టు ఆహ్వానాలు పలుకుతున్నది. దేశానికి చెందిన వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో పాటు 54 దేశాల నుంచి వంద మంది ప్రతినిధులు సైతం రామ్‌లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి ప్రత్యేక అతిథులుగా హాజరుకానున్నారు. రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, మారిషస్‌తో సహా అనేక యూరోపియన్, ఆఫ్రికన్, బౌద్ధ సంప్రదాయ దేశాలకు సైతం ఆహ్వానాలు పంపింది.
కార్యక్రమంలో పాల్గొనేందుకు సంఘ్ పరివార్, వీహెచ్‌పీ అంతర్జాతీయ శాఖల ప్రముఖులు సైతం రానున్నారు. రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్, విశ్వహిందూ పరిషత్‌ల సమన్వయంతో జనవరి 22న జరిగే ఈ మహత్తర కార్యక్రమాన్ని చరిత్రలో రికార్డు చేసేందుకు సన్నాహాలు చేసింది. దీపోత్సవ్ తరహాలో ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా విదేశీ అతిథులను ఆహ్వానించారు. వీటిలో కొన్ని దేశాల దౌత్యవేత్తలు సైతం ఉన్నారు. బావుడ్తో పాటు దక్షిణ పరిశ్రమకు చెందిన సినీ ప్రముఖులకు ఆహ్వానం అందింది. దక్షిణ భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో శ్రీరాముడిపై ఉన్న ప్రత్యేక విశ్వాసాన్ని దృష్టిలో ఉంచుకుని, వారిని రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆహ్వానాలు అందించింది. రజనీకాంత్, చిరంజీవి, ప్రభాస్, ధనుష్, మోహన్ లాల్ తదితర ప్రముఖులు ఆహ్వానాలు అందుకున్నవారిలో ఉన్నారు.
ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం రోజున 1.25లక్షల దీపాలను వెలిగించనున్నారు. రాంలాలా ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం సందర్భంగా అయోధ్య ధామ్‌లో పండుగ వాతావరణం నెలకొననున్నది. రామభక్తులు తమదైన రీతిలో పండుగను జరుపుకుంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాజస్థాన్‌లోని శ్రీకృష్ణ సేవా సంస్థాన్ బికనీర్ తరఫున సరయూ బ్యాంకు సహస్రధార హారతి ఘాట్‌లో మంగళవారం సాయంత్రం 1.25 లక్షల దీపాలు వెలిగించి దీపోత్సవం నిర్వహించారు. అనంతరం హనుమాన్ చాలీసాను సామూహికంగా పఠించారు. శ్రీ కృష్ణ సేవా సంస్థాన్ ప్రెసిడెంట్ శ్యామ్ సుందర్ సోని మాట్లాడుతూ 500 సంవత్సరాల తర్వాత జనవరి 22 న, రామ్‌లల్లా దివ్య ఆలయంలో దర్శనం ఇవ్వబోతున్నారన్నారు. ఇది మనందరికీ సంతోషం, గర్వకారణం అన్నారు.
గుజరాత్ నుంచి వచ్చిన 108 అడుగుల అగరుబత్తీ సువాసనలతో అయోధ్య పరిమళించింది. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అధ్యక్షుడు మహంత్ నృత్య గోపాల్ దాస్ బస్టాండ్‌లో పూజల అనంతరం అగరబత్తులు వెలిగించగా, జై శ్రీరామ్ నినాదాలు ప్రతిధ్వనించాయి. 3,610 కిలోల బరువు, 108 అడుగుల పొడవున్న ఈ అగరబత్తిని 44 రోజుల పాటు వెలుగనున్నది. రామజన్మభూమి కాంప్లెక్స్‌కు భారీ అగరుబత్తీలను తరలించడం సాధ్యం కాదని వీహెచ్‌పీ ప్రాంతీయ మీడియా ఇన్ఛార్జ్ శరద్ శర్మ తెలిపారు. ఈ పరిస్థితుల్లో అయోధ్య ధామ్ బస్టాండ్ కాంప్లెక్స్ లోపలనే భారీ అగర్‌బత్తీని వెలిగించినట్లు తెలిపారు.