లక్నో: అయోధ్యలో రామ మందిరం కోసం ఉద్యమాన్ని సిక్కులు ప్రారంభించారని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) అన్నారు. దేశంలో సనాతన ధర్మాన్ని కాపాడేందుకు సిక్కు సమాజం ఎంతో కృషి చేసిందని తెలిపారు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని గురుద్వారా అలంబాగ్‌లో శనివారం జరిగిన గురు గ్రంథ్ సాహిబ్ ప్రకాష్ ఉత్సవ్‌లో రాజ్‌నాథ్ సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, రామ జన్మభూమి ఉద్యమాన్ని సిక్కులు ప్రారంభించారని తెలిపారు. వారి సహకారాన్ని ఏ భారతీయుడు ఎప్పటికీ మరచిపోలేరని అన్నారు. ‘ప్రభుత్వ రికార్డుల ప్రకారం నేను ఒక ముఖ్యమైన వాస్తవాన్ని పంచుకోవాలనుకున్నా. ఎఫ్ఐఆర్ ప్రకారం 1858 డిసెంబర్ 1న గురు గోవింద్ సింగ్ పేరుతో నినాదాలు చేసిన సిక్కుల బృందం ఆ ప్రాంగణాన్ని స్వాధీనం చేసుకుంది. అక్కడ గోడలపై ప్రతి చోటా ‘రామ్ రామ్’ అని రాశారు’ అని రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు.
కాగా, సిక్కు గురువు గురునానక్ దేవ్‌ను రాజ్‌నాథ్ సింగ్ కొనియాడారు. భారతదేశాన్ని, భారతీయులను కాపాడాటానికి నానక్ స్ఫూర్తి ఇచ్చారని తెలిపారు. ‘ భారతదేశాన్ని, భారతీయులను రక్షించడం మన కర్తవ్యం. గురునానక్ దేవ్ కూడా ఈ స్ఫూర్తిని మనకు అందించారు’ అని ఆయన అన్నారు.