ప్రజాస్వామ్యంలో ఎన్నికలు పారదర్శకంగా జరుగాలి. లేకపోతే వినాశకర పరిణామాలు తలెత్తుతాయి. రాజ్యాంగ పరిధిలోనే ఈసీ పనిచేయాలి.
– మార్చి 2, 2023న సుప్రీంకోర్టు
ఐదు నెలల కిందట దేశ అత్యున్నత న్యాయస్థానం వ్యక్తం చేసిన ఆందోళనే ఇప్పుడు నిజమయ్యింది. రాజ్యాంగబద్ధంగా పనిచేయాల్సిన ఎన్నికల సంఘం (ఈసీ) కేంద్రంలోని బీజేపీ సర్కారు అదుపాజ్ఞల్లోకి వెళ్లనున్నది. కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈసీ), ఎన్నికల కమిషనర్ల (ఈసీ) నియామకాలను నియంత్రించేలా కేంద్రం కొత్త చట్టం తీసుకొచ్చేందుకు సిద్ధమవ్వడమే దీనికి నిదర్శనం.
(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ): ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మనది. అలాంటి భారతంలో ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా జరుగాలి. అయితే, కేంద్రంలోని బీజేపీ సర్కారు పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ఓ బిల్లు కారణంగా ఎన్నికల నిర్వహణ లోపభూయిష్టంగా మారే ప్రమాదమున్నట్టు పెద్దయెత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
సీఈసీతో పాటు మరో ఇద్దరు ఎన్నికల కమిషనర్ల నియామకాలకు సంబంధించి ప్రధాన ఎన్నికల అధికారి, ఇతర ఎన్నికల కమిషనర్ల (నియామకాలు, సర్వీసుల నిబంధనలు, పదవీకాలం) బిల్లు, 2023ను కేంద్రం గురువారం రాజ్యసభలో ప్రవేశపెట్టింది. ఈ బిల్లు ప్రకారం.. ఎన్నికల సంఘంలో (ఈసీ) నియామకాలను త్రిసభ్య కమిటీ సిఫార్సు మేరకు రాష్ట్రపతి నియమించాలి. ఈ కమిటీలో ప్రధానమంత్రి, లోక్‌సభలో ప్రతిపక్ష నేత, ప్రధాని నామినేట్ చేసిన కేంద్ర క్యాబినెట్ మంత్రి ఒకరు సభ్యులుగా ఉంటారు. ప్రధానమంత్రి ఈ కమిటీకి నేతృత్వం వహిస్తారని బిల్లులో స్పష్టం చేశారు. అయితే, ఈసీ నియామకాలకు సంబంధించిన ఈ త్రిసభ్య కమిటీలో గతంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) ఒక సభ్యుడిగా ఉండేవారు. అయితే కమిటీ నుంచి సీజేఐని తొలగించిన కేంద్రప్రభుత్వం.. క్యాబినెట్ మంత్రిని ఆ స్థానంలో భర్తీ చేయడం గమనార్హం.
ఎన్నికల కమిషనర్ల నియామకాలకు సంబంధించి గత మార్చిలో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఎన్నికల సంఘంలో నియామకాలను.. ప్రధాని, లోక్‌సభలో ప్రతిపక్ష నేత, సీజేఐ సభ్యులుగా ఉన్న కమిటీనే చేపట్టాలని ఆదేశించింది. ఈ త్రిసభ్య కమిటీ చేసిన సిఫార్సుల మేరకు సీఈసీ, ఈసీలను రాష్ట్రపతి నియమించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు జస్టిస్ కేఎం జోసఫ్, జస్టిస్ అజయ్ రస్తోగీ, జస్టిస్ అనిరుద్ద బోస్, జస్టిస్ హృషికేశ్ రాయ్, జస్టిస్ సీటీ రవికుమార్ సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం 5-0 మెజారిటీతో ఏకగ్రీవంగా తీర్పు వెలువరించింది. ఈ సందర్భంగా ధర్మాసనం కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రజాస్వామ్యంలో ఎన్నికల నిర్వహణ పారదర్శకంగా, స్వచ్ఛంగా ఉండాలని, ఎన్నికల నిర్వహణలో పారదర్శకత, స్వచ్ఛత లేకపోతే వినాశకర పరిణామాలు తలెత్తుతాయని ధర్మాసనం వ్యాఖ్యానించింది. రాజ్యాంగ పరిధిలోనే ఈసీ పనిచేయాలని, న్యాయబద్ధంగా వ్యవహరించాలని సూచించింది. అయితే, ఈసీల నియామకాల కోసం పార్లమెంట్లో కొత్త చట్టం తీసుకొచ్చేంత వరకు ఈ త్రిసభ్య కమిటీ అమల్లో ఉంటుందని అప్పుడు సుప్రీంకోర్టు వెల్లడించింది. దీంతో కేంద్రప్రభుత్వం పార్లమెంట్లో కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. అయితే, త్రిసభ్య కమిటీలో సీజేఐను తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ), ఇద్దరు ఎన్నికల కమిషనకర్ల (ఈసీ) నియామకాలను సుప్రీం తీర్పు వెలువరించడానికి ముందు ప్రధానమంత్రి నేతృత్వంలోని మంత్రిమండలి సిఫారసు మేరకు రాష్ట్రపతి చేపట్టేవారు. సాధారణంగా మాజీ ఏఐఎస్‌లను ఈసీలుగా నియమిస్తూ వస్తున్నారు. ఎలక్షన్ కమిషన్ చట్టం, 1991 ప్రకారం ఈసీగా నియమితులయ్యేవారు ఆరేండ్లపాటు లేదా 65 ఏండ్లు వచ్చే వరకు (ఏది ముందుగా వస్తే దాన్ని పరిగణిస్తారు) పదవిలో కొనసాగాలి. అయితే, మార్చిలో సుప్రీం తీర్పు అనంతరం.. ప్రధాని, లోక్‌సభలో ప్రతిపక్ష నేత, సీజేఐ సభ్యులుగా ఉన్న కమిటీ సిఫారసు మేరకు నియామకాలు జరిగేవి. ఇప్పుడు ఈ కమిటీలో సీజేఐ స్థానాన్ని క్యాబినెట్ మంత్రితో భర్తీ చేస్తున్నారు.
న్యూఢిల్లీ, ఆగస్టు 10: ఎన్నికల కమిషనర్ల నియామక ప్యానల్ నుంచి సీజేఐని తప్పిస్తూ కేంద్రం బిల్లు తీసుకురావడంపై ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. ప్రధాని చేతిలో ఈసీని కీలుబొమ్మగా మార్చే ప్రయత్నమే ఇది అని కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రధాని ఇలాంటి నిర్ణయాలు ఒకదాని తర్వాత మరొకటి తీసుకుంటూ భారత ప్రజాస్వామ్య విలువను బలహీనం చేస్తున్నారని ఆప్ అధ్యక్షుడు, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ విమర్శించారు. సుప్రీం కోర్టుపై మోదీకి విశ్వాసం లేదన్న విషయాన్ని గతంలోనే తాను స్పష్టం చేశానన్నారు. ఇక ముందు నియమితులయ్యే ఈసీలు బీజేపీకి విధేయంగా పనిచేయాల్సి ఉంటుందని ఆయన ఆరోపించారు. 2024 ఎన్నికల్లో యథేచ్ఛగా రిగ్గింగ్ చేయడానికే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని తృణమూల్ కాంగ్రెస్ విమర్శించింది. ఎంపిక కమిటీలో మోదీ, ఆయన క్యాబినెట్ మంత్రి నిర్ణయంతో సీఈసీ, ఇతర కమిషనర్ల నియామకం జరిగిపోతుందని, దీంతో వచ్చే ఎన్నికల్లో రిగ్గింగ్‌కు మార్గం సులువవుతుందని ఎంపీ సాకేత్ గోఖలే విమర్శించారు.