న్యూఢిల్లీ: అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీకి భారీ జలక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఏడుగురు ఎంపీలు ఇటీవల బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. అయితే ఆ విలీన ప్రక్రియను సోమవారం రాజ్యసభ చైర్మెన్(Rajya Sabha Chairman) సీపీ రాధాకృష్ణన్ ఆమోదించారు. దీంతో రాజ్యసభ వెబ్సైట్ ప్రకారం.. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీల సంఖ్య 10 నుంచి మూడుకు పడిపోయింది. ఇక బీజేపీ సంఖ్య 106 నుంచి 113కు చేరింది. ఇక రాజ్యసభలో ఎన్డీఏ బలంగా ఇప్పడు 141 నుంచి 148కి పెరిగింది. దీంతో రాజ్యసభలో మెజారిటీ మార్క్ అయిన 123 సంఖ్యకు బీజేపీ చేరువు అవుతున్నట్లు తెలుస్తోంది.
బీజేపీలో చేరినట్లు ఆమ్ ఆద్మీ పార్టీలు సమర్పించిన విలీన లేఖపై రాజ్యసభ చైర్మెన్ రాధాకృష్ణన్ న్యాయపరమైన అభిప్రాయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏడుగురు ఆప్ ఎంపీలు ఆ లేఖపై సంతకం చేశారు. అయితే ఆ పార్టీకి చెందిన రాజ్యసభ ఎంపీల సంఖ్యలో 2/3 మెజారిటీ ఉన్నది. దీంతో ఎంపీల విలీన ప్రక్రియకు దాదాపు క్లియరెన్స్ వచ్చేసింది. రాఘవ్ చద్దా, సందీప్ పాతక్, స్వాతి మాలివాల్, హర్భజన్ సింగ్, విక్రమ్‌జీత్ సాహ్నే, అశోక్ మిట్టల్, రాజేందర్ గుప్తాలు బీజేపీలో చేరారు.
ఆప్ ఎంపీలు రాసిన లేఖ రాజ్యాంగంలోని పదవ షెడ్యూల్‌కు తగినట్లు ఉందని రాజ్యసభ్య చైర్మెన్ భావిస్తున్నట్లు తెలిసింది. ఆ షెడ్యూల్ ప్రకారం 2/3 మెజారిటీ ఉంటే, విలీనాన్ని ఆమోదించవచ్చు. మరోవైపు ఆ ఏడుగురు ఎంపీలను అనర్హులుగా ప్రకటించాలని ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ చైర్మెన్‌ను కోరిన విషయం తెలిసిందే.