హైదరాబాద్, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ) : దేశంలోని నాలుగు రాష్ట్రాల్లో ఖాళీ అయిన ఆరు రాజ్యసభ స్థానాలకు డిసెంబర్ 20న ఉప ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ మేరకు మంగళవారం కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్లోని మూడు స్థానాలు, ఒడిశా, పశ్చిమబెంగాల్, హర్యానాలో ఒక్కో స్థానానికి ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ ఎన్నికలకు డిసెంబర్ 3న నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. 10వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ, 11న స్క్రూటినీ, 13 వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం కల్పించారు. డిసెంబర్ 20న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్ జరుగుతుంది. అదేరోజు సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్ ప్రారంభించి తుది ఫలితాలను ప్రకటిస్తారు.