చండీగఢ్, జూలై 24: హర్యానా బీజేపీలో రాజీనామాల పర్వం నడుస్తున్నది. ఇప్పటికే 40 మందికి పైగా రాజ్‌పుత్ నేతలు మూకుమ్మడిగా ఆ పార్టీకి రాజీనామా చేశారు. 9వ శతాబ్దానికి చెందిన రాజు సామ్రాట్ మిహిర్ బోజ్ విగ్రహావిష్కరణపై గుజ్జర్, రాజ్‌పుత్ సామాజికవర్గాల మధ్య నెలకొన్న విబేధాలే ఇందుకు కారణం. విగ్రహ పీఠంపై మిహిర్ బోజ్ పేరుకు ముందు రాసిన ‘గుజ్జర్’ అనే పదాన్ని తొలగించాలని రాజ్‌పుత్ కమ్యూనిటీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. తాజా వివాదం నేపథ్యంలో హర్యానాలోని రాజ్‌పుత్‌ల ఆధిపత్యం ఉండే చాలా గ్రామాల్లో బీజేపీ నేతల ప్రవేశాన్ని నిషేధించారు. ఈనెల 20న భారీ భద్రత మధ్య కైథాల్ బీజేపీ ఎమ్మెల్యే లీలారామ్ గుజ్జర్, ఇతర సామాజిక వర్గ నేతలు మిహిర్ బోజ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. విగ్రహంపై గుజ్జర్ పదాన్ని తొలగించాలని, హిందూ సామ్రాట్ పదాన్ని చేర్చాలని డిమాండ్ చేస్తూ అంతకుముందు రాజ్‌పుత్ కమ్యూనిటీ నేతలు ఆందోళన చేపట్టారు. పోలీసులు వారిపై లాఠీచార్జి చేయడంతో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. ఇంత జరిగినా, బీజేపీ ప్రభుత్వం మిహిర్ బోజ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించే కార్యక్రమాన్ని నిర్వహించిందని, బీజేపీకి రాజ్‌పుత్‌లను విస్మరిస్తున్నదని బీజేపీ కిసాన్ మోర్చా కైథాన్ జిల్లా అధ్యక్షుడు సంజీవ్ ఖన్నా మండిపడ్డారు.