ఢిల్లీలో హఠాత్తుగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. దీంతో దాదాపు 11 విమానాలను అధికారులు దారి మళ్లించారు. ఈ 11 విమానాల్లో కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రయాణించే విమానం కూడా వుందని ఢిల్లీ విమానాశ్రయ అధికారులు వెల్లడించారు. వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో విమానాలను లక్నో, జైపూర్ వైపు మళ్లించినట్లు అధికారులు పేర్కొన్నారు.
ఢిల్లీలో శుక్రవారం మధ్యాహ్నం నుంచి వర్షం ప్రారంభమైంది. సాయంత్రం అయ్యేసరికి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షంగా మారిపోయింది. ఈ భారీ వర్షానికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో తెగ పోస్ట్ అయ్యాయి. విపరీతమైన ఉక్కపోతతో ఉన్న ఢిల్లీ వాసులకు ఈ వర్షం రిలీఫ్ ఇచ్చింది.
వాతావరణం అనుకూలంగా లేకపోవడం, వర్షం, ఉరుముల కారణంగా విమానాలను దారి మళ్లించాం. దయచేసి విమాన ప్రయాణికులు ఈ విషయాన్ని దృష్టిలో వుంచుకోవాలి. మరింత లేటెస్ట్ సమాచారం కోసం విమానాశ్రయ అధికారులను సంప్రదించాలి అని ఢిల్లీ విమానాశ్రయ అధికారులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.