Parliament | మణిపూర్‌తో పాటు పలు అంశాలపై చర్చకు డిమాండ్ చేస్తూ విపక్షాలు చేస్తున్న ఆందోళనతో పార్లమెంట్ ఉభయసభలు దద్దరిల్లుతున్నాయి. అయితే, కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ విపక్ష పార్టీల నేతలతో టెలీఫోన్లో సంభాషించారు. పార్లమెంట్ సమావేశాలను సజావుగా సాగేలా చూడాలని కోరారు. రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే, తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు సుదీప్ బందోపాధ్యాయతో మాట్లాడారు. పార్లమెంట్లో నెలకొన్న ప్రతిష్ఠంభనకు ముగింపు పలుకనున్నట్లు బీజేపీ వర్గాలు పేర్కొన్నాయి. అలాగే పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి, సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ప్రతిపక్ష నేతలను సంప్రదిస్తున్నారని చెప్పారు. లోక్‌సభలో ఉప సభాపతి రాజ్‌నాథ్ సింగ్ సోమవారం మాట్లాడుతూ పార్లమెంట్లో అన్నిఅంశాలపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. మణిపూర్ ఘటన ఖచ్చితంగా చాలా తీవ్రమైన విషయమన్నారు. యావత్ దేశం సిగ్గుపడేలా చేసిందన్నారు. అయితే ఈ అంశంపై చర్చించాలని పలువురు విపక్ష ఎంపీలు సోమవారం వాయిదా నోటీసులు ఇచ్చారు.
మణిపూర్‌లో జరిగిన హింసాకాండపై విపక్షాల చర్చకు పట్టుపట్టడంతో వరుసగా మూడో రోజు రాజ్యసభ కార్యకలాపాలకు అంతరాయం కలిగింది. ఆ తర్వాత రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖర్ సోమవారం సభలోని అన్ని పార్టీల నేతల సమావేశానికి పిలుపునిచ్చారు. సజావుగా సాగేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో కాంగ్రెస్‌కు చెందిన జైరాం రమేశ్, భారత రాష్ట్ర సమితి నేత కేకే కేశవరావు, బిజూ జనతాదళ్ (బీజేడీ)కి చెందిన సస్మిత్ పాత్ర, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి చెందిన రాఘవ్ చద్దా, సభా నాయకుడు పీయూష్ గోయల్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి సహా పలువురు నేతలు హాజరయ్యారు.
ఇదిలా ఉండగా.. ఈ నెల 20న పార్లమెంట్ సమావేశాలు మొదలుకాగా.. అప్పటి నుంచి పార్లమెంట్ కార్యకలాపాలకు అంతరాయం కలుగుతున్నది. సోమవారం లోక్‌సభలో ప్రతిపక్ష నేతలు తమ డిమాండ్లపై ప్లకార్డులు ప్రదర్శించి నినాదాలు చేశారు. అయితే, ఆగస్టు 11న సమావేశాలు ముగియనుండగా.. పలు బిల్లులను ఆమోదించుకునేందుకు ప్రభుత్వం యోచిస్తున్నది.