Rajnath Singh | పాకిస్తాన్‌తో కొనసాగుతున్న ఉద్రిక్తతల మధ్య రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శుక్రవారం సౌత్ బ్లాక్‌లో సైన్యం, నేవీ, వాయుసేన అధిపతులతో సమావేశయయ్యారు. సమావేశానికి త్రివిధ దళాల అధిపతులతో పాటు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా గత రాత్రి పాకిస్తాన్ జరిపిన దాడులు, భారత దళాలు స్పందించిన తీరుపై రాజ్‌నాథ్‌కు వివరించారు. ప్రస్తుతం సరిహద్దుల్లో పరిస్థితి, ప్రస్తుతం చేపట్టాల్సిన చర్యలపై వారితో రాజ్‌నాథ్ చర్చించారు. గతరాత్రి పాకిస్తాన్ సైన్యం డ్రోన్లు, మిస్సైల్స్‌తో దాడి చేసిన విషయం తెలిసిందే. ఇంతకు ముందు రాజ్‌నాథ్ సింగ్ అఖిలపక్ష నేతలతో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు.
సమావేశంలో ఆయన మాట్లాడుతూ సరిహద్దుల వెంట ఉగ్రవాద స్థావరాలు, మౌలిక సదుపాయాలు లక్ష్యంగా చేసుకొని జరిపిన దాడుల్లో వంద మందికిపైగా ఉగ్రవాదులు హతమయ్యారని తెలిపారు. ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదని.. ఇప్పటికీ కొనసాగుతుందని తెలిపారు. పాకిస్తాన్ నుంచి రొచ్చగొట్టే చర్యలుంటే స్పందించేందుకు భారత సైన్యం సిద్ధంగా స్పష్టం చేశారు. శత్రువులు దాడి చేస్తే ప్రతీకారం తీర్చుకునేందుకు వెకాడబోమని స్పష్టం చేశారు. ప్రతిపక్ష నేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ తదితరులు సమావేశానికి హాజరైన విషయం తెలిసిందే. అనంతరం పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ అన్ని పార్టీలు ప్రభుత్వానికి సంఘీభావం తెలిపాయరన్నారు. జాతీయ భద్రత రాజకీయాల కంటే ముఖ్యమని అందరూ అంగీకరించారన్నారు. అలాగే, నేతలంతా సాయుధ దళాలను ప్రశంసించారని.. ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు పూర్తి మద్దతును ప్రకటించారని ఆయన పేర్కొన్నారు.