Perarivalan : భారత మాజీ ప్రధాని (Former Prime Minister) రాజీవ్ గాంధీ (Rajiv Gandhi) హత్య కేసులో దోషిగా జైలుశిక్ష అనుభవించిన ఎమ్జీ పెరారివాళన్ (MG Perarivalan).. తాజాగా న్యాయవాదిగా మారారు. తమిళనాడు-పుదుచ్చేరి బార్ అసోసియేషన్ (Tamil Nadu-Puduccheri Bar Association) లో న్యాయవాదిగా ఆయన తన పేరు నమోదు చేసుకున్నారు. నాడు రాజీవ్ గాంధీ హత్య కేసులో 31 ఏళ్లపాటు జైలు జీవితం గడిపిన పెరారివాళన్ 2022లో సుప్రీంకోర్టు (Supreme Court) ఆదేశాల మేరకు విడుదలయ్యారు.
ఆ తర్వాత బెంగళూరులోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ లా కాలేజీలో న్యాయవిద్యను అభ్యసించారు. అక్కడ డిగ్రీ పూర్తి చేసి 2025లో ఆల్ ఇండియా బార్ నిర్వహించిన పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. త్వరలో ఆయన మద్రాస్ హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేయనున్నారు. ఈ సందర్భంగా పెరారివాళన్ మీడియాతో మాట్లాడుతూ.. సరైన న్యాయ సహాయం అందక జైళ్లల్లో మగ్గిపోతున్న వేలాది మంది ఖైదీల గొంతుకగా మారడమే తన లక్ష్యమని చెప్పారు. న్యాయం అందని నిరుపేద జీవిత ఖైదీల కోసం తాను పనిచేయాలనుకుంటున్నట్లు తెలిపారు.
కాగా, 1991 మే 21న తమిళనాడులోని శ్రీ పెరంబదూర్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న రాజీవ్‌గాంధీపై ఓ మహిళ ఆత్మాహుతి దాడికి పాల్పడింది. ఆ బాంబు తయారీకి అవసరమైన రెండు బ్యాటరీలను నాటి 19 ఏళ్ల పెరారివాళన్ కొనుగోలు చేసి ఇచ్చారు. ఈ కేసులో పెరారివాళన్‌కు 1998లో తొలుత ఉగ్రవాద వ్యతిరేక కోర్టు మరణశిక్ష విధించింది. 2014లో సుప్రీంకోర్టు దాన్ని జీవిత ఖైదుగా మార్చింది. ఆ తర్వాత తమిళనాడు గవర్నర్ క్షమాభిక్ష ప్రసాదించడంతో ఆయన్ను విడుదల చేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఉత్తర్వులు జారీచేసింది.