పూర్ణియా, ఏప్రిల్ 21: రాజేష్ రంజన్ అలియాస్ పప్పూ యాదవ్.. ఈ పేరు ఈసారి బీహార్ లోక్‌సభ ఎన్నికల్లో ప్రముఖంగా వినిపిస్తున్నది. పూర్ణియా స్థానం నుంచి మూడుసార్లు ఎంపీగా గెలిచిన ఆయన ప్రస్తుతం స్వతంత్ర అభ్యర్థిగా అక్కడి నుంచి మరోసారి బరిలోకి దిగారు. ఎన్డీఏ, ఇండియా కూటములకు ఆయన గట్టి పోటీ ఇస్తున్నారని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. తాను స్థాపించిన జన్ అధికార్ పార్టీని ఇటీవల ఆయన కాంగ్రెస్‌లో విలీనం చేశారు. అయితే కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అయితే ఆయనపై ఇప్పటికీ కాంగ్రెస్ బహిష్కరణ వేటు వేయకపోవడం గమనార్హం.
‘ప్రణామ్ పూర్ణియా’ పేరుతో ఏడాదిగా పప్పూ యాదవ్ చేపడుతున్న ప్రచారం ఆయనకు మంచి పేరు తెచ్చి పెట్టిందని స్థానికులు చెప్తున్నారు. మోటార్ సైకిల్‌పై వాడవాడలా తిరుగుతూ ఆయన ఉత్సాహంగా ప్రచారం చేస్తున్నారు. అన్ని వర్గాల మద్దతుతో అగ్ర వర్ణాల బీజేపీని, ముస్లిం-యాదవ్ కాంబినేషన్‌ను నమ్ముకున్న ఇండియా కూటమిని మట్టి కరిపిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. పప్పూ యాదవ్ ఎన్డీఏ ఏజెంట్ అని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ఆరోపిస్తున్నారు. ఆర్జేడీ నుంచి మాజీ మంత్రి బీమా భారతి పోటీలో ఉన్నారు.