జైపూర్: కువైట్‌లో పని చేస్తున్న ఒక వ్యక్తి అక్కడి నుంచి భార్యకు ఫోన్ చేసి ట్రిపుల్ తలాక్ (Triple Talaq) చెప్పాడు. ఆ తర్వాత సోషల్ మీడియాలో పరిచయమైన పాకిస్థానీ మహిళను సౌదీ అరేబియాలో పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం తెలిసిన ఆ వ్యక్తి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ కాగానే పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు. రాజస్థాన్‌లోని చురు జిల్లాకు చెందిన 35 ఏళ్ల రెహ్మాన్ జీవనోపాధి కోసం కువైట్ వెళ్లాడు. అక్కడ రవాణా రంగంలో పనిచేస్తున్నాడు. 2011లో హనుమాన్‌ఘడ్ జిల్లాకు చెందిన ఫరీదా బానుతో రెహ్మాన్ పెళ్లి జరిగింది. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు.
కాగా, కువైట్‌లో ఉంటున్న రెహ్మాన్‌కు పాకిస్థానీ మహిళ మెహ్విష్తో సోషల్ మీడియా ద్వారా పరిచయం ఏర్పడింది. దీంతో ఆమెను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించాడు. గత నెలలో కువైట్ నుంచి భార్యకు ఫోన్ చేసి ట్రిపుల్ తలాక్ చెప్పాడు. ఆ తర్వాత మెహ్విష్ను సౌదీ అరేబియాలో పెళ్లిచేసుకున్నాడు. గత నెలలో ఆమె టూరిస్ట్ వీసాపై రాజస్థాన్‌లోని చురుకు చేరుకుంది. రెహ్మాన్ తల్లిదండ్రులతో కలిసి నివసిస్తున్నది.
మరోవైపు కువైట్ నుంచి ఫోన్లో ట్రిపుల్ తలాక్ చెప్పి పాకిస్థాన్ మహిళను పెళ్లాడిన రెహ్మాన్‌పై రాజస్థాన్‌లోని అతడి భార్య ఫరీదా బాను గత నెలలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. వరకట్నం కోసం తనను వేధించడంతో పుట్టింట్లో ఉంటున్నట్లు చెప్పింది. దీంతో రెహ్మాన్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సోమవారం కువైట్ నుంచి జైపూర్ విమానాశ్రయంలో ఫ్లైట్ దిగిన రెహ్మాన్‌ను హనుమాన్ఘడ్కు చెందిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భార్య ఫిర్యాదుపై అతడ్ని ప్రశ్నించిన తర్వాత అరెస్ట్ చేశారు.