జైపూర్, అక్టోబర్ 11: పాకిస్థాన్ ఐఎస్ఐ తరఫున గూఢచర్యం చేస్తున్న అల్వార్‌కు చెందిన మంగత్ సింగ్ అనే వ్యక్తిని రాజస్థాన్ ఇంటెలిజెన్స్ అరెస్టు చేసింది. పాకిస్థాన్ పన్నిన ‘హనీ ట్రాప్’లో పడిపోయిన మంగత్ సింగ్, భారత సైన్యానికి చెందిన సున్నితమైన సమాచారాన్ని ఆ దేశానికి అందజేశాడని ఆరోపణలున్నాయి.
పాకిస్థాన్‌కు చెందిన రెండు నంబర్లతో మంగత్ నిత్యం కాంటాక్ట్‌లో ఉన్నాడని, పెద్ద మొత్తంలో నగదు అక్కడ్నుంచి ఇతడికి అందిందని డీఐజీ ఇంటెలిజెన్స్ రాజేశ్ మీల్ చెప్పారు. సోషల్‌మీడియా ద్వారా పరిచయమైన ‘ఇషా శర్మ’ అనే పాక్ మహిళ ద్వారా మంగత్ సింగ్‌ను హనీ ట్రాప్ చేసినట్టు అరెస్టు అనంతరం జరిగిన విచారణలో తేలింది.