జైపూర్: రాజస్థాన్ రాష్ట్ర రాజధాని జైపూర్లో దారుణం జరిగింది. కాళ్ల కడియాల కోసం దొంగలు ఓ వృద్ధురాలి రెండు కాళ్లు తెగ నరికేశారు. వివరాల్లోకి వెళ్తే.. జైపూర్లోని గాట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ కాలనీలో వందేండ్ల వృద్ధురాలి కాళ్లకు ఉన్న వెండి కడియాలపై దొంగల కన్నుపడింది. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి దొంగలు ఆమె రెండు కాళ్లను తెగ నరికేసి కడియాలను ఎత్తుకెళ్లారు.
బయటికి వెళ్లిన మనుమరాలు ఇంటికి వచ్చేసరికి వృద్ధురాలు రెండు కాళ్లను కోల్పోయి రక్తపు మడుగులో పడి ఉంది. ఆ దృశ్యాలను చూసి భయపడ్డ ఆమె వెంటనే తన తల్లికి ఫోన్ చేసి విషయం చెప్పింది. ఇరుగు పొరుగు వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితురాలు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఈ హృదయవిధారక ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
సమాచారం అందిన వెంటనే వృద్ధురాలిని తీసుకొచ్చి ఆస్పత్రిలో చేర్పించామని, ఆమె తెగిపోయిన రెండు కాళ్లను కూడా రికవరీ చేసి వైద్యులకు అప్పగించామని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఆమెకు చికిత్స కొనసాగుతున్నదని చెప్పారు. వృద్ధురాలి మెడపై కూడా కత్తి గాట్లు ఉన్నాయన్నారు. దొంగల కోసం గాలింపు చేపట్టినట్లు పేర్కొన్నారు. విషయం గురించి నా బిడ్డ ఫోన్ చేసి చెప్పిందని బాధితురాలి కుమార్తె గంగాదేవి విలపిస్తూ చెప్పింది.