హైదరాబాద్, డిసెంబర్ 20 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ):ప్రధాని మోదీ, పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ ఆప్తమిత్రులని, అదానీ కోసం బీజేపీ సర్కారు ఏమైనా చేస్తుందని ప్రతిపక్ష నేతలు విమర్శిస్తుంటారు. బీజేపీ పాలిత రాజస్థాన్‌లో ఇటీవల జరిగిన ఓ ఘటనను పరిశీలిస్తే ఇది నిజమేననిపిస్తున్నది. అదానీ కంపెనీకి వ్యతిరేకంగా తీర్పునిచ్చిన ఓ కమర్షియల్ కోర్టు జడ్జిని రాజస్థాన్ బీజేపీ ప్రభుత్వం తీర్పు వెలువడిన రోజే బదిలీ చేసింది.
వివరాల్లోకి వెళ్తే.. మైనింగ్ కాంట్రాక్ట్ తీసుకొన్న అదానీ గ్రూప్‌నకు చెందిన ఓ కంపెనీ రైల్వే లైన్‌ను నిర్మించడంలో విఫలమైంది. దీంతో బొగ్గును తరలించేందుకు రోడ్డు మార్గాన్ని వినియోగించాలని, ముందస్తుగా ఆ ఖర్చులనూ భరించాలని కోర్టు తీర్పునిచ్చింది.
అయితే, రవాణా వ్యయాన్ని రూ.1400 కోట్లు ఎక్కువగా చూపిస్తూ ప్రభుత్వ ఖజానాకు నష్టం చేకూర్చేలా అదానీ కంపెనీ లెక్కలు మార్చినట్టు కోర్టులో ఓ సంస్థ ఫిర్యాదు చేసింది. విచారణ చేపట్టిన జైపూర్‌లోని కమర్షియల్ కోర్టు జడ్జి గుప్తా.. అదానీ కంపెనీకి జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. అంతే, అదే రోజున రాజస్థాన్‌లోని బీజేపీ ప్రభుత్వం.. రాజధాని జైపూర్‌కు 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న బేవార్ జిల్లాలోని ఓ టౌన్‌కు జడ్జిని బదిలీ చేసింది. కాగా, అదానీ కంపెనీకి వ్యతిరేకంగా తీర్పును ఇవ్వడంతోనే జడ్జిని బీజేపీ ప్రభుత్వం బదిలీ చేసిందని విపక్షాలు మండిపడ్డాయి.