paramedical exam : దేశంలో నీట్, మహారాష్ట్ర టెట్ పేపర్ లీకేజీలు, రద్దు ఘటనలు మర్చిపోకముందే మరో పరీక్ష రద్దైంది. రాజస్థాన్‌లోని ఒక కాలేజీలో మాస్ కాపీయింగ్ జరగడంతో పారామెడికల్ డిప్లొమా పరీక్షను రద్దు చేస్తూ రాజస్థాన్ పారామెడికల్ కౌన్సిల్ ఆదేశాలు జారీ చేసింది. రాజస్థాన్‌లో పారామెడికల్ డిప్లొమా కోర్సు చదువుతున్న విద్యార్థులకు పరీక్షలు జరుగుతున్నాయి. ఈ కోర్సుల్లో ఉత్తీర్ణత, మంచి స్కోరు సాధించిన వారికి ప్రభుత్వ వైద్య రంగంలో ఉద్యోగాలు దొరుకుతాయి. అలాగే, ప్రైవేటు రంగంలోనూ ఉద్యోగావకాశాలుంటాయి. మంగళవారం కూడా పారామెడికల్ డిప్లొమా పరీక్ష జరిగింది.
రాజస్థాన్, కల్వార్ ప్రాంతంలో ఉన్న ప్రభాదేవి మెమోరియల్ పీజీ కాలేజీలో ఈ పరీక్ష నిర్వహిస్తుండగా మాస్ చీటింగ్ జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ సెంటర్లోని కొందరు విద్యార్థులంతా ఒకే చోట పరీక్ష రాసేలా ఒప్పందం కుదిరింది. ఝుంఝును ప్రాంతానికి చెందిన ఒక పారామెడికల్ కాలేజీకి చెందిన 45 మంది డిప్లొమా విద్యార్థులు ఒకే చోట పరీక్ష రాసేందుకు రూ.5.5 లక్షలు చెల్లించారు. దీనికి పరీక్ష జరుగుతున్న పీజీ కాలేజ్ ఆపరేటర్ రామకృష్ణ మండివాల్, అతడి బంధువు దేవికృష్ణ సహకరించారు. వీరి సహకారంతో 45 మంది విద్యార్థులు ఒకే దగ్గర కాపీ కొడుతూ పరీక్ష రాశారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు తనిఖీ నిర్వహించగా అసలు విషయం బయటపడింది. ఎగ్జామ్ హాల్లో స్లిప్స్ కూడా దొరికాయి. దీంతో చీటింగ్‌కు పాల్పడుతున్న విద్యార్థుల్ని, నిర్వాహకుల్ని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. వీరిలో రామకృష్ణ, దేవికృష్ణలను పోలీసులు అరెస్టు చేశారు.
మాస్ చీటింగ్ విషయం బయటపడటంతో ఇతర విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. కాపీయింగ్ జరిగిన కాలేజీ వద్ద నిరసన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలంటూ, పరీక్ష రద్దు చేయాలంటూ డిమాండ్ చేశారు. ఈ నిరసనల్లో కాలేజీ ఫర్నీచర్ కూడా ధ్వంసమైంది. దీనిపై రాజస్థాన్ పారామెడికల్ కౌన్సిల్ స్పందించింది. ఈ పరీక్షను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. నిందితులపై చర్యలు తీసుకునేందుకు ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసింది. కాపీయింగ్‌కు పాల్పడిన కాలేజీ గుర్తింపును కూడా రద్దు చేసింది. మరోవైపు పోలీసులు కూడా ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.