జైపూర్: ఆమె అసలు సాఫ్ట్ వేర్ ఉద్యోగియే (Software Employee) కాదు. అయినా రెండు టెక్ కంపెనీల్లో జాబ్. ఒక్క రోజు కూడా ఆఫీస్‌కు వెళ్లలేదు. అయినా ప్రతినెల ఠంచనుగా ఆమె అకౌంట్లలో జీతం పడించింది. ఇలా ఇంట్లో కూర్చునే రెండేండ్లలో ఏకంగా రూ.37 లక్షల 54 వేలు సంపాదించింది. ఇంజినీరింగ్, డిగ్రీ పట్టాలు ఉన్నా ఉద్యోగం ఎలా సంపాదించాలని చాలామంది నెలల తరబడి కంపెనీల చుట్టూ తిరుగుతూ ఉంటారు.. అయినా ఆమె రెండు ఉద్యోగాలు ఎలా సంపాదించారనుకుంటున్నారా?.. ఆమె భర్త రాజస్థాన్ ప్రభుత్వ (Govt Officer) ఐటీ శాఖలో డైరెక్టర్ కావడమే.
ప్రధ్యుమ్న్ దీక్షిత్ (Pradyuman Dixit) అనే వ్యక్తి రాజస్థాన్ ప్రభుత్వ రాజ్‌కాంప్ ఇన్ఫో సర్వీసెస్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగంలో జాయింట్ డైరెక్టర్‌గా ఉన్నారు. ఓరియన్ప్రో సొల్యూషన్స్, ట్రీజెన్ సాఫ్ట్వేర్ లిమిటెడ్ సంస్థలకు ప్రభుత్వ టెండర్లు దక్కేలా దీక్షిత్ చేశాడు. ప్రతిగా తన భార్య పూనమ్ దీక్షిత్‌కు ఉద్యోగం ఇవ్వాలని రెండు కంపెనీలను డిమాండ్ చేశాడు. ప్రతి నెల జీతం చెల్లించాలని ప్రతిపాదించాడు. దీంతో ఓరియన్ప్రో కంపెనీలో ఉద్యోగిగా, ట్రీజెన్ సాఫ్ట్‌వేర్‌లో ఫ్రీలాన్సింగ్ చేస్తున్నట్లుగా నకిలీ పత్రాలు సృష్టించాడు. ప్రతి నెలా అతడే నకిలీ అటెండెన్స్ సమర్పించేవాడు. ఇలా 2019 జనవరి నుంచి 2020 సెప్టెంబర్ వరకు పూనమ్ దీక్షిత్‌కు చెందిన వ్యక్తిగత బ్యాంక్ అకౌంట్లలో జీతం రూపంలో రూ.37,54,405 జమ అయ్యాయి. ఇలా పెద్దమొత్తంలో లంచంగా సంపాదించాడు.
ఈ తంతంగంపై రాజస్థాన్ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. దీంతో న్యాయస్థానం ఏసీబీ విచారణకు ఆదేశించింది. అధికారుల దర్యాప్తులో భాగంగా ప్రధ్యుమ్న్ దీక్షిత్ నకిలీ ఉద్యోగం వ్యవహారం వెలుగులోకి వచ్చింది.