జైపూర్, నవంబర్ 1: కారుణ్య నియామకానికి సంబంధించిన ఓ అరుదైన కేసులో రాజస్థాన్ హైకోర్టు (Rajasthan High Court) జోధ్‌పూర్ బెంచ్ ఓ చారిత్రక తీర్పును వెలువరించింది. అల్వార్ జిల్లాలోని ఖేర్లీలో నివసించే భగవాన్ సింగ్ కోడలు శశి కుమారి జీతం నుంచి ప్రతి నెల రూ.20 వేలు మినహాయించి దాన్ని భగవాన్ సింగ్ బ్యాంకు ఖాతాలో డిపాజిట్ చేయాలని అజ్వీర్ డిస్కమ్ని జస్టిస్ ఫర్జంద్ అలీ ఆదేశించారు. 2025 నవంబర్ 1 నుంచి ఈ మినహాయింపు ప్రారంభమై భగవాన్ సింగ్ జీవిత కాలం కొనసాగాలని న్యాయమూర్తి ఆదేశించారు. అక్టోబర్ 29న కోర్టు ఈ తీర్పును వెలువరించింది. నయీ నజోరీ మొహల్లా నివాసి భగవాన్ సింగ్ సైనీ దాఖలు చేసిన పిటిషన్ ప్రకారం ఆయన కుమారుడు, అజ్మీర్ డిస్కమ్‌లో టెక్నికల్ అసిస్టెంట్‌గా పనిచేసే రాజేష్ కుమార్ 2015లో సర్వీసులో ఉండగా మరణించారు.
కారుణ్య నియామకం కోసం దరఖాస్తు చేసుకోవాలని ఆయన తండ్రి భగవాన్ సింగ్‌కి డిస్కమ్ లేఖలు రాసింది. అయితే మృతుడి భార్య శశి కుమారి కూడా కారుణ్య నియామకం కోసం దరఖాస్తు చేసుకున్నారు. వాస్తవానికి కారుణ్య నియామకం అవకాశం ముందుగా భగవాన్ సింగ్‌కి లభించింది. తనకు బదులుగా తన కోడలికి కారుణ్య నియామకం ఇవ్వాలని ఆయన స్వచ్ఛందంగా సిఫార్సు చేశారు. మరణించిన తన భర్త తల్లిదండ్రులతోనే తాను జీవిస్తూ వారికి అండగా ఉంటానని, వారి యోగక్షేమాల బాధ్యతను తాను పూర్తిగా తీసుకుంటానని, తాను పునర్వివాహం చేసుకోనని శశి కుమారి 2015 అక్టోబర్ 19న ఓ అఫిడవిట్ సమర్పించారు. అయితే శశి కుమారి ఇచ్చిన అఫిడవిట్ పూర్తిగా అబద్ధమని, ఆమె తన తల్లిదండ్రులతో కలసి విడిగా ఉంటోందని పిటిషనర్ భగవాన్ సింగ్ ఆరోపించారు. ఆమె జీతం నుంచి 50 శాతాన్ని తన బ్యాంకు ఖాతాలో డిపాజిట్ చేయాలని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్ పర్జంద్ అలీ కారుణ్య నియామకం హక్కు కాదని, మరణించిన ప్రభుత్వ ఉద్యోగి కుటుంబాన్ని ఆర్థిక కష్టాల నుంచి కాపాడే కరుణతో కూడిన చర్యని అన్నారు.
కుటుంబం అంటే భార్య మాత్రమే కాదు
కారుణ్య నియామక పథకంలో కుటుంబం అన్న పదానికి అర్థం కేవలం వితంతువు ఒక్కరిగానే పరిగణించరాదని న్యాయస్థానం పేర్కొంది. మరణించిన ఉద్యోగిపైన ఆధారపడిన ప్రతి ఒక్కరినీ కుటుంబంలో భాగంగానే చూడాలని కోర్టు తెలిపింది. మృతుడి తల్లిదండ్రులు, భార్య, పిల్లలు అందరినీ కలిపే కుటుంబంగా పరిగణించాలని న్యాయమూర్తి చెప్పారు.