జైపూర్ : రాజస్దాన్‌లోని కోటాలో విద్యార్ధుల ఆత్మహత్యల కేసులు పెరగడంపై రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్, ఆ పార్టీ ఎమ్మెల్యే గోవింద్ సింగ్ దోతస్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విద్యార్ధులు చెడు స్నేహాలు విడిచిపెట్టి జీవితంలో సానుకూల దృక్పదంతో ఉండాలని వ్యాఖ్యానించారు. ఈరోజుల్లో యువత కుంగుబాటుతో బాధపడుతున్నారని అన్నారు.
గతంలో పిల్లలు కుటుంబాలతో కలిసి ఉండేవారని, పెద్దలతో మాట్లాడి వారి సూచనల ప్రకారం నడుచుకునేవారని గుర్తుచేశారు. విద్యార్ధులు చెడు స్నేహాలను వీడి జీవితంలో సానుకూల దృక్పధంతో ముందుకు సాగాలని కోరుతున్నానని ఆయన పేర్కొన్నారు. కాగా, కోచింగ్ సెంటర్లు డబ్బు దండుకునే కేంద్రాలుగా మారాయని రాజస్ధాన్ మంత్రి ప్రతాప్ సింగ్ కచరియవస్ అన్నారు. కోటలోని కోచింగ్ ఇనిస్టిట్యూట్‌ల్లో విద్యార్ధుల ఆత్మహత్య కేసులు పెరుగుతుండటం పట్ల మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు.
రాజస్ధాన్‌లోని కోచింగ్ ఇనిస్టిట్యూట్ల నిర్వాహకులు అత్యంత సంపన్నులని, అయితే వారు డబ్బు కోసం విద్యార్ధులను వేధించడం మానుకోవాలని హితవు పలికారు. కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు జాగ్రత్తగా వ్యవహరించకపోతే వారి సంస్ధలు ఖాళీ అవుతాయని మంత్రి హెచ్చరించారు. ఈ తరహా కోచింగ్‌తో మీ పిల్లలు ముందుకు పోలేరని తాను తల్లితండ్రులకు చెబుతున్నానని అన్నారు. పిల్లలు ఎంతో తెలివైనవారని, కానీ తల్లితండ్రులు కోచింగ్ సంస్ధల నిర్వాహకులకు డబ్బు ఇస్తుంటే వారు మాత్రం మీ పిల్లలను వేధింపులకు గురిచేస్తున్నారని చెప్పారు.
ప్రతి క్షణం, ప్రతి మూడురోజులకు ఒకసారి పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆయన కోచింగ్ సంస్ధలను నిలదీశారు.నీట్ (నేషనల్ ఎలిజిబిలిటీ అండ్ ఎంట్రన్స్ టెస్ట్)కు హాజరయ్యే అభ్యర్ధి ఆదివారం కోటలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఏడాది కోచింగ్ హబ్‌గా పేరొందిన కోటలో తనువు చాలించిన 23వ ఆత్మహత్య కేసు ఇది కావడం గమనార్హం. కోచింగ్ సెంటర్లను మాఫియాగా అభివర్ణించిన ఆయన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతుందని హెచ్చరించారు.
Read More :
Tim Cook | ఆపిల్ సీఈవో టిమ్ కుక్ పేరిట ఫేక్ ఇన్‌స్టా అకౌంట్..! తొలగించిన మెటా కంపెనీ..!