జైపూర్, డిసెంబర్ 14: ఎమ్మెల్యే నిధులు (MLA Funds) కావాలా? అయితే 40 శాతం కమీషన్ ఇవ్వాల్సిందే! అంటూ రాజస్థాన్‌లో అధికార బీజేపీకి (BJP) చెందిన ఎమ్మెల్యే ఒకరు డిమాండ్ చేస్తూ అడ్డంగా దొరికిపోయారు. ఓ జాతీయ మీడియా సంస్థ జరిపిన స్టింగ్ ఆపరేషన్ కమీషన్ల బాగోతం బట్టబయలైంది. ఈ కమీషన్లు డిమాండ్ చేసిన వారిలో అధికార బీజేపీతో పాటు విపక్ష కాంగ్రెస్, స్వతంత్ర ఎమ్మెల్యే కూడా ఉండటం గమనార్హం. ఎమ్మెల్యే స్థానిక ప్రాంత అభివృద్ధి (ఎల్ఏడీ) పథకం కింద ప్రభుత్వం ప్రతి ఏటా రూ.5 కోట్ల నిధులను కేటాయిస్తుంది. ఎమ్మెల్యేలు ఆ నిధులను తమకు నచ్చిన అభివృద్ది పనులకు కేటాయించ వచ్చు. అభివృద్ది ప్రాజెక్టులకు ఎమ్మెల్యే నిధులు కావాలంటే తమకు లంచంగా పెద్దమొత్తంలో కమీషన్ ఇవ్వాలంటూ రాజస్థాన్‌లో వారు నిర్మొహమాటంగా డిమాండ్ చేశారు. జాతీయ మీడియా సంస్థకు చెందిన రిపోర్టర్ ఒకరు ఉనికిలో లేని ఒక డమ్మీ సంస్థకు తనను యజమానిగా చెప్పుకుంటూ పలువురు ఎమ్మెల్యేలను కలిశాడు.
తమ సంస్థ ఖాదీ గ్రామీణ పరిశ్రమ బోర్డుకు అనుసంధానమై ఉందని, స్కూళ్లకు ఎమ్మెల్యే కోటా నిధుల ద్వారా కార్పెట్లు సరఫరా చేస్తుందని తెలిపాడు. అయితే ఏయే స్కూళ్లకు సరఫరా చేస్తారు?, ఎంతమందికి చేస్తారు?, వాటి ధర ఎంత లాంటి వివరాల జోలికి వెళ్లకుండా ఎమ్మెల్యేలు అడిగింది ఒకే ఒక ప్రశ్న. మాకు ఎంత కమీషన్ ఇస్తారు? అని. బీజేపీ ఎమ్మెల్యే రేవంత్రం దంగా (కిన్వసర్), కాంగ్రెస్ ఎమ్మెల్యే అనితా జాతవ్ (హిందాన్), స్వతంత్ర ఎమ్మెల్యే రితు బనావత్ (బయనల్)లు అయితే కమీషన్ల గురించి బహిరంగంగానే చర్చించారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యే అనితా జాతవ్ రూ.50 వేలు అడ్వాన్స్ తీసుకుని 80 లక్షల ఎమ్మెల్యే నిధులకు సిఫార్సు లేఖ కూడా ఇచ్చేశారు. ఇండిపెండెంట్ ఎమ్మెల్యే రితు బనావత్ భర్త 40 లక్షల డీల్‌ను ఓకే చేశారు. ఎమ్మెల్యేలు దంగా, అనితాలు జడ్పీ సీఈవోలను ఉద్దేశించి సిఫార్సు లేఖలు కూడా రాసి ఇచ్చారు. ఎమ్మెల్యే దంగా అయితే రూ.50 లక్షల పనికి రూ.10 లక్షల అడ్వాన్స్ తీసుకుని లేఖను ఇచ్చారు. అధికారులకు కూడా కొంత ఇవ్వండని ఆయన ఉచిత సలహా ఇచ్చారు. ఎమ్మెల్యేలతో జరిపిన సంభాషణలను అంతా రిపోర్టర్ వీడియో రికార్డింగ్ చేశారు. ఎమ్మెల్యేల అవినీతి బాగోతం ఇలా బయటపడటం ఇప్పుడు రాజస్థాన్‌లో సంచలనంగా మారింది.