Raj Babbar : కాంగ్రెస్ పార్టీకి యూపీలో మరో భారీ ఝలక్ తగలనుందా? మొన్నటికి మొన్న యూపీ సీనియర్ నేత, అధిష్ఠానానికి అత్యంత ఆప్తుడైన ఆర్పీఎన్ సింగ్ ఉన్న ఫళంగా కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పేశారు. ఇప్పుడు మరో సీనియర్ నేత, నటుడు రాజ్‌బబ్బర్ కూడా గుడ్ బై చెప్పే సూచనలు కనిపిస్తున్నాయి. ట్వీట్లు, ఆయన వ్యాఖ్యల ద్వారా ఆయన ఈ విషయాన్ని పరోక్షంగా చెబుకుంటూ వస్తున్నారన్న అనుమానాలు రాజకీయ శిబిరంలో బలపడుతున్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్‌కు కేంద్రం పద్మ అవార్డు ఇవ్వడంలో కాంగ్రెస్ నిట్ట నిలువునా చీలిన విషయంతెలిసిందే. అధిష్ఠానానికి వీర విధేయులనే వారు కాస్త చురుకులు పెడుతూ వ్యాఖ్యానిస్తే, జీ 23 నేతలు మాత్రం గులాంనబీకి శుభాకాంక్షలు తెలిపారు.
తాజాగా రాజ్ బబ్బర్ కూడా గులాంనబీ ఆజాద్‌కు శుభాకాంక్షలు తెలిపారు. శుభాకాంక్షలు.. నాకు మీరు అన్నయ్య లాంటి వారు. మీ నిష్కళంకమైన జీవితం, గాంధేయవాద ఆదర్శాల మీద మీకున్న నమ్మకం, మీ నిబద్ధత మాకెప్పుడూ ప్రేరణగానే నిలుస్తాయి. ఇన్ని సంవత్సరాల పాటు మీరు దేశానికి చేసిన సేవలకు పద్మ అవార్డు ఆదర్శంగా నిలుస్తోంది అంటూ రాజ్‌బబ్బర్ ట్వీట్ చేశారు. తమ సొంత పార్టీ నేతలకు పద్మ అవార్డులు ఇవ్వడం పెద్ద గొప్పేమీ కాదని, విపక్ష నేతలకు కూడా ఇలాంటి గొప్ప గొప్ప అవార్డులు ఇవ్వడమే గొప్ప అని రాజ్‌బబ్బర్ పేర్కొన్నారు. పద్మభూషణ్ విషయంలో కాంగ్రెస్‌లో జరుగుతున్న చర్చ వ్యర్థమైనదిగా ఆయన అభివర్ణించారు.
వీటన్నింటినీ చూస్తుంటే రాజ్‌బబ్బర్ తిరిగి తన సొంత గూటికే చేరడానికి ప్రయత్నాలు ప్రారంభించారని సమాచారం. సమాజ్‌వాదీ పార్టీలోకి తిరిగి చేరేందుకు ఆయన తన ప్రయత్నాలను ముమ్మరం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. చాలా రోజులుగా రాజ్‌బబ్బర్ సమాజ్‌వాదీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్‌తో టచ్‌లోనే ఉన్నట్లు సమాజ్‌వాదీ నేతలే పేర్కొంటున్నారు. ఈ విషయంపై సమాజ్‌వాదీ సీనియర్ నేత ఫక్రుల్ హస్సన్ చాంద్ మాట్లాడుతూ.. 10 రోజులుగా రాజ్‌బబ్బర్ అఖిలేశ్ యాదవ్‌తో టచ్‌లోనే ఉన్నారని వెల్లడించారు. తిరిగి సమాజ్‌వాదీలోకి చేరేందుకు కూడా రాజ్‌బబ్బార్ అంగీకరించారని, అందుకే అఖిలేశ్ కూడా ఓకే చెప్పారని ఆయన పేర్కొన్నారు.