బెంగళూరు, జనవరి 28 : కర్ణాటక ప్రజలపై మరో బాదుడుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతున్నది. బెంగళూరు వాటర్ బోర్డు ప్రతి ఏడాది వెయ్యి కోట్ల నష్టాన్ని ఎదుర్కొంటున్నదని, ఈ క్రమంలో నీటి చార్జీల పెంపు తప్పనిసరని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అన్నారు. అధికారులతో సమావేశమైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ నీటి చార్జీల పెంపుపై ఒక నివేదిక తయారు చేసి సమర్పించాలని అధికారులను ఆదేశించినట్టు చెప్పారు. నీటి చార్జీల పెంపుపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. అలాగే నీటి సరఫరా సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. 2014 నుంచి నీటి చార్జీలు పెంచలేదని, దాని కారణంగా బోర్డు ఏడాదికి వెయ్యి కోట్ల నష్టాన్ని ఎదుర్కొంటున్నదని అన్నారు. విస్తృత చర్చల అనంతరమే నీటి చార్జీల పెంపు ఎంత అన్నదానిపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు మురికివాడలో నివసిస్తున్న పేదలకు నీటి సరఫరా కోసం 20 కోట్లను కేటాయించామని, అయితే తర్వాత అధికారంలోకి వచ్చిన బీజేపీ దానిని నిలిపివేసిందని ఆరోపించారు.