నిజామాబాద్: గత కొన్నిరోజులుగా శీతల గాలులు, చలితో వణికిపోతున్న ప్రజలకు కాస్త ఉపశమనం కలిగింది. నిజామాబాద్ (Nizamabad) జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తున్నది. సోమవారం తెల్లవారుజాము నుంచే నిజామాబాద్, డిచ్పల్లి, ఆర్మూర్, ఇందల్వాయి, ధర్పల్లి, సిరికొండ మండలాల్లో వాన పడుతున్నది. జిల్లాల్లో ఉదయం నుంచి వాన కురుస్తుండటంతో చలి కాస్త తగ్గింది.
రాష్ట్రంలో ఈ నెల 13 వరకు అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర పాకిస్థాన్ పరిసర ప్రాంతాల్లో, రాజస్థాన్ నుంచి విదర్భ వరకు ఏర్పడిన ఉపరితల ద్రోణులు ఈ నెల 12 వరకు తెలంగాణపైకి వచ్చే అవకాశం ఉన్నట్టు పేర్కొన్నది.
వీటి ప్రభావంతో 12న జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో పలుచోట్ల భారీ వానలు పడొచ్చని వెల్లడించింది. రాష్ట్రంలోకి ఆగ్నేయ దిశ నుంచి గాలులు వీస్తున్నాయి. ఉపరితల ద్రోణుల కారణంగా కొద్దిగా ఉష్ణోగ్రతలు పెరిగాయి. 11 డిగ్రీల వరకు పడిపోయిన రాత్రి ఉష్ణోగ్రతలు ఆదివారం 15 డిగ్రీలపైన నమోదైనట్టు టీఎస్డీపీఎస్ తెలిపింది.