Weather update | న్యూఢిల్లీ, జూన్ 27: దేశంలో నైరుతి రుతుపవనాల రాక ఆలస్యమవడంతో వానలు ముఖం చాటేశాయి. ఈ ఏడాది జూన్లో సాధారణం కంటే 30 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. నిరుడితో పోలిస్తే ఇదే సమయంలో (జూన్ 24) 4 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. దీని వల్ల రిజర్వాయర్లలో నీటిమట్టాలు అడుగంటుతున్నాయి. ఈ మేరకు మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ నివేదికను విడుదల చేసింది.
జూన్ 22 నాటికి దక్షిణాదిలోని రిజర్వాయర్లలో నీటిమట్టం 26 శాతానికి చేరుకున్నాయని నివేదికలో పేర్కొంది. ఇది గడిచిన నాలుగేండ్లలో కనిష్ఠమని తెలిపింది. బిజర్పాయ్ తుఫాను కారణంగా రుతుపవనాల రాక ఆలస్యమైందని పేర్కొంది. దీని కారణంగా వాయవ్యం మినహా దేశమంతటా సాధారణం కంటే తక్కువ వర్షపాతాలు నమోదవుతున్నాయని తెలిపింది. దక్షిణాదిలో సాధారణం కంటే 51 శాతం తక్కువ, మధ్య భారత్లో 51 శాతం, పశ్చిమ, ఈశాన్య రీజియన్లలో 19 శాతం సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైనట్టు నివేదికలో వెల్లడించింది.
జూన్లో 19 శాతమే వర్షపాతం…
ఈ ఏడాదిలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం పడే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఈ ఏడాది మొత్తం పడాల్సిన వర్షపాతంలో జూన్లో అతితక్కువగా 19 శాతం, జులైలో మూడింట ఒక వంతు, ఆగస్టులో 29 శాతం వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ తెలిపింది.
మందగించిన పంటల సాగు…
వర్షాభావంతో ఇప్పటివరకు 4.5 శాతం పంటలే సాగయ్యాయి. గతేడాదితో పోలిస్తే వరి (-36), పత్తి (-14.2), జనపనార (-12.2) శాతం మేర సాగు తగ్గింది. తెలంగాణలో సాధారణం కంటే 64 శాతం, పశ్చిమబెంగాల్లో 28, ఉత్తరప్రదేశ్లో 52, ఆంధ్రప్రదేశ్లో 38, ఒడిశాలో 54, చత్తీస్గఢ్లో 70, హర్యానాలో 31, మధ్యప్రదేశ్లో 53 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. రానున్న రోజుల్లో బియ్యం ధరలు పెరిగే అవకాశం ఉన్నది.