న్యూఢిల్లీ, అక్టోబర్ 19: సిబ్బంది కొరతను అధిగమించేందుకు రైల్వే బోర్డు దేశవ్యాప్తంగా వివిధ జోన్లలో 25 వేల పోస్టులకు రిక్రూట్మెంట్ డ్రైవ్‌ను ప్రారంభించింది. ఇందులో రిటైర్డ్ ఉద్యోగులకు సైతం అవకాశం కల్పించింది. 65 ఏండ్లలోపు వయసున్న రిటైర్డ్ రైల్వే ఉద్యోగులు సూపర్వైజర్ల నుంచి ట్రాక్‌మెన్ వరకు వివిధ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటించింది.
తాత్కాలికంగా రెండేండ్ల పాటు పనిచేసేలా వీరిని నియమించుకుంటామని, అవసరమైతే ఉద్యోగ కాలాన్ని పొడిగిస్తామని తెలిపింది. రిటైర్డ్ ఉద్యోగుల మెడికల్ ఫిట్నెస్తో పాటు ఉద్యోగ విరమణకు ముందు వారి ఐదేండ్ల పనితీరు ఆధారంగా ఈ నియామకాలను చేపట్టేలా ఉత్తర్వులు జారీ చేసినట్టు వెల్లడించింది. ఇలా నియమితులైనవారికి గతంలో చివరిసారి పొందిన నెలవారీ వేతనం నుంచి బేసిక్, పెన్షన్‌ను మినహాయించి మిగిలిన మొత్తాన్ని జీతంగా చెల్లిస్తామని, ప్రయాణ భత్యాలు లాంటి ప్రయోజనాలను పొందవచ్చని వివరించింది. ఇంక్రిమెంట్లు, ఇతర ప్రయోజనాలు ఉండవని రైల్వే బోర్డు తెలిపింది.