న్యూఢిల్లీ, డిసెంబర్ 20: ఆధార్ ధృవీకరణ గల ఐఆర్సీటీసీ యూజర్లకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. రైలు టికెట్(జనరల్ కేటగిరి) రిజర్వేషన్‌కు సంబంధించి ‘ముందస్తు రిజర్వేషన్ గడువు’ (ఏఆర్పీ) సమయాన్ని అర్ధరాత్రి 12 గంటలకు వరకు (మొదటి రోజున)పొడిగించింది. దీనిని ఈ నెల 29 నుంచి దశలవారీగా అమల్లోకి తీసుకొస్తున్నట్టు తాజాగా ప్రకటించింది. ప్రస్తుతం ఈ సౌకర్యం ఉదయం 8 నుంచి 10 గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉంది.
ఏఆర్పీ విధానం తొలుత 15 నిమిషాలు ఉండగా.. దశల వారీగా అర్ధరాత్రి వరకు పెంచుతున్నట్టు ప్రిన్సిపాల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్లకు రాసిన లేఖల్లో రైల్వే బోర్డ్ తెలిపింది. జనరల్ కేటగిరిలో రైల్వే టికెట్ రిజర్వేషన్లో అక్రమాలను అరికట్టేందుకు ‘ఏఆర్పీ’ విధానాన్ని కొన్ని నెలల కింద ప్రవేశపెట్టారు.