న్యూఢిల్లీ, ఆగస్టు 31: ‘నువ్వెక్కాల్సిన రైలు జీవితకాలం లేటు’ అన్నారో కవి. భారతీయ రైళ్లు నిజంగానే దీనిని సార్థకం చేసుకున్నాయి. అయితే, రైలు మాత్రమే కాదు.. రైల్వే ప్రాజెక్టులు కూడా లేటేనని తాజాగా వెల్లడైంది. మౌలిక సదుపాయాల రంగంలో అత్యధిక ప్రాజెక్టులు ఆలస్యంగా నడుస్తున్న వాటి జాబితాలో రైల్వే రంగం రెండో స్థానాన్ని ఆక్రమించింది. రోడ్డు రవాణా, జాతీయ రహదారుల రంగం ఈ జాబితాలో టాప్ ప్లేస్లో ఉంది. 2002లో రైల్వేలో 56 ప్రాజెక్టులు ఆలస్యంగా నడుస్తుండగా, 2023 నాటికి ఆ సంఖ్య 98కి పెరిగింది.
ఈ మేరకు స్టాటిస్టిక్స్, ప్రొగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఇన్ప్రాస్ట్రక్చర్ ప్రాజెక్టు మానిటరింగ్ విభాగం వెల్లడించింది. దేశంలో రైల్వే చేపట్టిన 10 మెగా ప్రాజెక్టుల్లో 7 నత్తనడకన సాగుతున్నాయి. ఇందులో ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైలు లైన్ కూడా ఉంది. 21 సంవత్సరాల క్రితమే ఇది పూర్తికావాల్సి ఉండగా, ఇంకా పడుతూలేస్తూనే ఉంది. ప్రస్తుతం 24 సెక్టార్లలో 1,646 ప్రాజెక్టులు చేపట్టగా, అందులో 148 ప్రాజెక్టులు భారతీయ రైల్వేకు చెందినవే. ఇవన్నీ నిర్ణీత సమయానికి మించి సంవత్సరాల తరబడి ఆలస్యంగా నడుస్తున్నాయి.