న్యూఢిల్లీ, డిసెంబర్ 3 : రైల్వే టికెట్ బుకింగ్ వ్యవస్థను మరింత పారదర్శకంగా మార్చేందుకు రైల్వే శాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రైల్వే రిజర్వేషన్ కౌంటర్ల ద్వారా తీసుకునే తత్కాల్ టికెట్లకు ‘వన్‌టైమ్ పాస్వర్డ్’ (ఓటీపీ) వెరిఫికేషన్‌ను తప్పనిసరి చేస్తున్నట్టు ప్రకటించింది. కౌంటర్ వద్ద రిజర్వేషన్ ఫారం నింపిన తర్వాత టికెట్ బుకింగ్ ప్రక్రియలో ప్రయాణికుడి మొబైల్ నంబర్‌కు వచ్చిన ఓటీపీని నమోదుచేయాల్సి ఉంటుంది.
ఆ తర్వాతే తత్కాల్ టికెట్ జారీ అవుతుంది. తత్కాల్ బుకింగ్ సమయంలో జరుగుతున్న అక్రమాల్ని నియంత్రించడానికి ఈ కొత్త నిబంధనను తీసుకొస్తున్నట్టు రైల్వే మంత్రిత్వ శాఖ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నది. ఓటీపీ ఆధారిత టికెట్ బుకింగ్ విధానంపై నవంబర్ 17 నుంచి రైల్వే శాఖ పైలట్ ప్రాజెక్ట్ చేపట్టింది. కొద్ది రైళ్లతో ప్రారంభించి.. 52 రైళ్లకు విస్తరించింది. సమీప భవిష్యత్‌లో ఈ విధానాన్ని అన్ని రిజర్వేషన్ కౌంటర్లకు వర్తింపజేస్తామని రైల్వే శాఖ తెలిపింది.