Rail Minister : రైళ్లలో ప్రయాణికుల కోసం అందించే దుప్పట్లు, దిండ్లను ఎన్ని రోజులకు ఒకసారి ఉతుకుతారని లోక్‌సభలో ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ (Ashwini Vaishnav) రాతపూర్వక సమాధానం ఇచ్చారు. రైళ్లలో దుప్పట్లను నెలకు ఒకసారి ఉతుకుతారని ఆయన తన సమాధానంలో పేర్కొన్నారు. బెడ్‌రోల్ కిట్‌లో మెత్తని కవర్‌గా ఉపయోగించేందుకు అదనపు షీట్‌ను కూడా అందిస్తున్నట్లు మంత్రి స్పష్టం చేశారు.
పరిశుభ్రత ప్రమాణాలకు అనుగుణంగా పరుపుల క్లీనింగ్ కోసం ప్రయాణికులు రుసుము చెల్లిస్తున్నారని, మరి రైల్వేలో నెలకు ఎన్నిసార్లు దుప్పట్లను ఉతుకుతారని కాంగ్రెస్ ఎంపీ కుల్దీప్ ఇండోరా అడిగిన ప్రశ్నకు ఆయన పైవిధంగా సమాధానం చెప్పారు. ఇండియన్ రైల్వేలో ఉపయోగించే దుప్పట్లను తేలికగా, సులభంగా ఉతకవచ్చని రైల్వే మంత్రి తెలిపారు. రైళ్లలో ప్రయాణికుల సౌకర్యం, భద్రతను నిర్ధారించడానికి తీసుకున్న ఇతర చర్యల గురించి కూడా మంత్రి తెలియజేశారు.
నాణ్యత కోసం BIS ధృవీకరణతో కూడిన కొత్త నార సెట్ల సేకరణ, శుభ్రమైన నార సెట్ల సరఫరా కోసం మెకనైజ్డ్ లాండ్రీలు, ప్రామాణిక యంత్రాలు, వాషింగ్ కోసం రసాయనాల వినియోగం మొదలైనవి ఉంటాయని స్పష్టం చేశారు. అంతేకాదు ఉతికిన నార వస్తువుల నాణ్యతను తనిఖీ చేయడానికి వైటో మీటర్‌ని ఉపయోగిస్తారని వైష్ణవ్ తెలిపారు. రైల్‌మదాద్ పోర్టల్‌లో నమోదైన ఫిర్యాదులను పర్యవేక్షించడానికి రైల్వే జోనల్ హెడ్‌క్వార్టర్స్, డివిజనల్ స్థాయిలో ‘వార్ రూమ్’లను ఏర్పాటు చేసినట్లు మంత్రి వెల్లడించారు.