Rahul Yatra | రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర పునః ప్రారంభమైంది. ఇవాళ ఉదయం పుల్వామా జిల్లా అవంతిపొరాలోని చుర్సు నుంచి మొదులపెట్టారు. పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీతో పాటు పెద్ద సంఖ్యలో మహిళలు, కాంగ్రెస్ కార్యకర్తలు జోడో యాత్రలో పాల్గొన్నారు. ప్రియాంక గాంధీ కూడా యాత్రలో చేరుతారని పార్టీ వర్గాల ద్వారా సమాచారం. భద్రతా లోపం కారణంగా రాహుల్ గాంధీ తన యాత్రను శుక్రవారం విరమించారు. భద్రతా లోపానికి బీజేపీయే కారణమని కాంగ్రెస్ ఆరోపించింది. పాంపోర్‌లోని బిర్లా ఇంటర్నేషనల్ స్కూల్ సమీపంలో టీ విరామం కోసం కొద్దిసేపు ఆగారు. శ్రీనగర్ శివారు పంథా చౌక్‌లోని ట్రక్ యార్డ్‌లో ఇవాళ రాత్రి విశ్రాంతి తీసుకుంటారు.
జమ్ముకశ్మీర్‌లో శుక్రవారం రాహుల్ గాంధీ భద్రతా వలయంలోకి పలువురు చేరారు. రాహుల్‌కు భద్రత విషయంలో జరిగిన ఈ లోపంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే శుక్రవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. ఈ విషయంలో హోంమంత్రి వ్యక్తిగతంగా జోక్యం చేసుకోవాలని ఖర్గే విజ్ఞప్తి చేశారు. అలాగే, యాత్రలో పాల్గొనే ప్రజలకు భద్రత కల్పించాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. నిన్న ఖాజీగుండ్లోకి ప్రవేశించిన కిలోమీటర్ దూరం తర్వాత భద్రతలో లోపం వెలుగులోకి వచ్చింది. ఇక్కడ చాలా మంది రాహుల్ భద్రతా వలయంలోకి ప్రవేశించారు. దాంతో పోలీసులు రాహుల్, ఒమర్ అబ్దుల్లాను కారులో అనంత్‌నాగ్‌కు తీసుకెళ్లారు. కాగా, రాహుల్ భద్రత విషయంలో జమ్ముకశ్మీర్ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకున్నదని అక్కడి హోంశాఖ అదనపు చీఫ్ సెక్రెటరీ ఆర్కే గోయల్ చెప్పారు. భారత్ జోడో యాత్రకు అన్ని భద్రతా ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు.
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సెప్టెంబర్ 7న కన్యాకుమారి నుంచి ప్రారంభమైంది. గురువారం రాత్రి పంజాబ్ నుంచి జమ్ముకశ్మీర్‌లోకి ప్రవేశించింది. రేపు ఉదయం పంథా చౌక్ నుంచి యాత్ర బౌలేవార్డ్ రోడ్డులోని నెహ్రూ పార్కుకు చేరుకుంటుంది. జనవరి 30న శ్రీనగర్‌లోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో రాహుల్ గాంధీ జాతీయ జెండాను ఆవిష్కరించడంతో యాత్ర ముగుస్తుంది.