తిరువనంతపురం,సెప్టెంబర్ 11: కేరళకు చెందిన 16 ఏళ్ల కుర్రాడు రాహుల్ జాన్ కృత్రిమ మేధస్సు (ఏఐ) ఆవిష్కరణలతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాడు. కేవలం తన ప్రతిభతోనే కాదు, సొంత ఏఐ స్టార్టప్ ‘ఆర్మ్ టెక్నాలజీస్’లో తన తండ్రికే ఉద్యోగమిచ్చి వార్తల్లో నిలిచాడు. ఆరేండ్ల వయసులోనే ఏఐ నేర్చుకోవడం ప్రారంభించిన రాహుల్ 16 ఏళ్లు వచ్చేసరికి ‘మీ-బాట్’ అనే రోబోను తయారు చేశాడు. రాహుల్ తన జ్ఞానాన్ని యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌ల ద్వారా ఉచితంగా పంచుకుంటున్నాడు.
ప్రజల నిజ జీవిత సమస్యలకు పరిష్కారాలు చూపేలా వీడియోలు చేస్తుంటాడు. అతడు ఇప్పటికే 10కి పైగా ఏఐ టూల్స్ రూపొందిం చాడు. యువత తమ దైనందిన పనులలో సాంకేతికతను ఉపయోగించుకుని పని భారాన్ని తగ్గించుకోవాలని, లాభాలను పెంచుకోవాలని కోరుతున్నాడు. కోయంబత్తూరులో జరిగిన ‘ఇండియా టుడే సౌత్ కాన్క్లేవ్’లో రాహుల్ మాట్లాడుతూ భారతదేశం ప్రపంచ ఏఐ పోటీలో చేరడం కాకుండా సొంతంగా టెక్ రేస్‌ను సృష్టించాలని సూచించాడు.