న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు కూడా గెలువలేదు. దీంతో ఆ పార్టీపై సోషల్ మీడియాలో ‘మీమ్స్’ వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో సోమవారం లోక్సభలో బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ (Anurag Thakur) రాహుల్ గాంధీని వినూత్నంగా టార్గెట్ చేశారు. రూ.12 లక్షల ఆదాయం వరకు ‘సున్నా’ పన్ను అని రాసి ఉన్న చిన్న పోస్టర్ను ఆయన ప్రదర్శించారు.
కాగా, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అధిక ఆదాయపు పన్ను విధించారని అనురాగ్ ఠాకూర్ విమర్శించారు. అయితే తమ ప్రభుత్వం కోట్లాది మంది సామాన్య ప్రజల్లో ఆనందాన్ని చూస్తోందని తెలిపారు. సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్న మీమ్ నేపథ్యంలో ‘రాహుల్ జీ, సున్నాను చెక్ చేయండి’ అని అన్నారు.
మరోవైపు కాంగ్రెస్ పార్టీ 1998 నుంచి 15 ఏళ్లు ఢిల్లీని పాలించిందని బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ తెలిపారు. అయితే 2014 తర్వాత ఢిల్లీలో ఒక్కసీటు కూడా ఆ పార్టీ గెలువలేకపోవడాన్ని ఆయన ఎద్దేవా చేశారు. 2014 లోక్సభ ఎన్నికల్లో ఢిల్లీ ప్రజలు కాంగ్రెస్కు ఎన్ని సీట్లు ఇచ్చారని సభను ఉద్దేశించి ప్రశ్నించారు. దీంతో బీజేపీ సభ్యులు ‘ సున్నా’ అని బదులిచ్చారు.
అలాగే ‘2015 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఎన్ని సీట్లు ఇచ్చారు? సున్నా. 2019 లోక్సభ ఎన్నికల్లో ఎన్ని సీట్లు ఇచ్చారు? సున్నా. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్ని సీట్లు ఇచ్చారు? సున్నా. 2024 లోక్సభ ఎన్నికల్లో ఎన్ని సీట్లు ఇచ్చారు? సున్నా. 2025 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్ని సీట్లు ఇచ్చారు? సున్నా’ అని అనురాగ్ ఠాకూర్ అన్నారు. ఈ సున్నాల రికార్డును సృష్టించే పని ఎవరైనా చేసి ఉంటే, అది రాహుల్ గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీయే అని ఆయన విమర్శించారు.