CWC meet : రాహుల్‌గాంధీయే లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా వ్యవహరించాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) కోరింది. ఇవాళ ఢిల్లీలో జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. సీడబ్ల్యూసీ సమావేశం ముగిసిన అనంతరం కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, పార్టీ అధికార ప్రతినిధి జైరామ్ రమేశ్ మీడియాతో మాట్లాడారు.
లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా వ్యవహరించాలని సీడబ్ల్యూసీ సమావేశంలో తాము ఏకగ్రీవంగా ప్రతిపాదన చేశామని కేసీ వేణుగోపాల్ చెప్పారు. తమ ప్రతిపాదనపై ఆలోచించి నిర్ణయం తీసుకుంటానని రాహుల్‌గాంధీ చెప్పారని ఆయన తెలిపారు. సాధ్యమైనంత త్వరలో తన నిర్ణయాన్ని వెల్లడిస్తానని చెప్పారని అన్నారు. రెండు చోట్ల గెలిచిన రాహుల్‌గాంధీ ఏ స్థానానికి రాజీనామా చేస్తారని మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు.
ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ, కేరళలోని వాయనాడ్ నుంచి గెలిచిన రాహుల్‌గాంధీ రెండింట్లో ఏదో ఒక స్థానాన్ని వదులుకునేందుకు ఈ నెల 15 వరకు గడువు ఉన్నదని, కానీ ఈ మూడు నాలుగు రోజుల్లో ఆయన నిర్ణయం తీసుకుంటారని కేసీ వేణుగోపాల్ చెప్పారు. నితీశ్ కుమార్ ఇండియా కూటమి వైపు వస్తే పీఎం పదవి ఇస్తామని ఆఫర్ చేసినట్లు కేసీ త్యాగీ చెబుతున్నారుగా అన్న ప్రశ్నకు.. ఆ విషయం తనకు తెలియదని అన్నారు.