న్యూఢిల్లీ : దళిత నేత జిగ్నేష్ మేవానీ అరెస్ట్‌పై మోదీ సర్కార్ లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పించింది. అసమ్మతిని మీరు అణిచివేసినా సత్యాన్ని ఏమార్చలేరని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ గురువారం ట్వీట్ చేశారు.మోదీజీ.. మీరు అధికార యంత్రాంగంతో అసమ్మతిని అణిచివేయాలని చూసినా సత్యాన్ని ఎన్నడూ నొక్కిపెట్టలేరని రాహుల్ కేంద్ర సర్కార్ తీరును దుయ్యబట్టారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం విమర్శలకు భయపడుతోందని అర్ధరాత్రి దళిత నేత జిగ్నేష్ మేవానీ అరెస్ట్ ఇందుకు విస్పష్ట సంకేతమని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జీవాలా అన్నారు.
మేవానీ అరెస్ట్ రాజ్యాంగ విరుద్ధ చర్య అని కాంగ్రెస్ ట్వీట్ చేసింది. ప్రజలు ఎన్నుకున్న నేతను అదుపులోకి తీసుకోవడం ప్రజలను అవమానించడమేనని మండిపడింది. మోదీ సర్కార్ అణిచివేత చర్యలను కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజల్లో దీటుగా ఎండగడతారని పేర్కొంది. కాగా, గుజరాత్ కాంగ్రెస్ నేత, వడ్గామ్ ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీని అసోం పోలీసులు అరెస్టు చేశారు.
ట్వీట్‌కు సంబంధించిన కేసులో పాలన్పూర్ సర్క్యూట్ హౌస్ వద్ద బుధవారం రాత్రి 11.30 గంటల సమయంలో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అహ్మదాబాద్ తరలించారు. అటునుంచి గురువారం ఉదయం గువాహటి తీసుకెళ్లారు. మేవానీని అరెస్టు చేసినట్లు అసోం పోలీసులు ట్వీట్ చేశారు. కొద్ది రోజుల క్రితం షేర్ చేసిన ట్వీట్ ఆధారంగా రెండు వర్గాల మధ్య శత్రుత్వాన్ని కలిగించేందుకు యత్నించారని, శాంతియుత వాతావరణానికి విఘాతం కలిగించారని కేసు నమోదుచేశారు.