బెంగళూర్ : కర్నాటక అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ తేదీ దగ్గరపడటంతో ప్రచార పర్వం క్లైమాక్స్‌కు చేరింది. ప్రధాన పార్టీల అగ్రనేతలు సుడిగాలి పర్యటనలతో రాష్ట్రాన్ని చుట్టేస్తూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. కాషాయ పాలనలో కర్నాటకలో ఎటు చూసినా స్కామ్‌లే కనిపిస్తున్నాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul gandhi) అన్నారు. ఆదివారం అనెకల్లో జరిగిన ర్యాలీని ఉద్దేశించి రాహుల్ మాట్లాడుతూ బీజేపీ ఎమ్మెల్యే కుమారుడు రూ. 8 కోట్లతో పట్టుబడగా, మరో బీజేపీ ఎమ్మెల్యే సీఎం పదవిని రూ. 2500 కోట్లతో కొనుగోలు చేయవచ్చని చెబుతున్నారని మండిపడ్డారు.
కర్నాటకలో అవినీతి గురించి ఇవాళ ఆరేండ్ల బాలుడికి కూడా తెలుసన్నారు. గత మూడేండ్ల బీజేపీ పాలనలో విచ్చలవిడిగా పెరిగిన అవినీతి గురించి కూడా ప్రధాని మోదీ మాట్లాడాలని రాహుల్ నిలదీశారు. కర్నాటకలో డబుల్ ఇంజిన్ సర్కార్‌లో ఏ ఇంజన్ 40 శాతం కమీషన్‌ను తినేసిందో ప్రధాని మోదీ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా, ముడిబిద్రిలో జరిగిన బహిరంగ సభలో కాషాయ పార్టీ లక్ష్యంగా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ విమర్శలు గుప్పించారు. కర్నాటకలో హింస ప్రజ్వరిల్లితే అది రాష్ట్రంలో 40 శాతం కమిషన్ సర్కార్ చలువేనని ఆమె ఆరోపించారు.
మోదీజీ..కర్నాటకలో అలజడి రేగితే అది మీ సర్కార్ హయాంలో తాండవించిన నిరుద్యోగం నిర్వాకంతోనేనని దుయ్యబట్టారు. గతంలో కార్పొరేషన్ బ్యాంక్, విజయా బ్యాంక్, సిండికేట్ బ్యాంక్, కెనరా బ్యాంక్ వంటి నాలుగు వేర్వేరు బ్యాంకులు ఉండేవని, మోదీ సర్కార్ ఈ బ్యాంకులన్నింటినీ ఒకే బ్యాంకులో విలీనం చేసిందని అన్నారు. కర్నాటకలో ప్రజలు మార్పు కోరుతున్నారని, కాంగ్రెస్ సర్కార్ కర్నాటకలో కొలువు తీరనుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక మే 10న కర్నాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుండగా 13న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు.
Read More
Watch: కాలువలో కరెన్సీ నోట్ల కట్టలు.. వాటి కోసం పోటీ పడిన స్థానికులు