న్యూఢిల్లీ : భారత్-చైనా మధ్య సరిహద్దు వివాదం నేపధ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ తీరును కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తప్పుపట్టారు. చైనాను చూసి ప్రధాని మోదీ భయపడుతున్నారని మండిపడ్డారు. సరిహద్దు వివాదం పట్ల ప్రధాని మోదీ మౌనం దేశానికి హానికరమని రాహుల్ ఆందోళన వ్యక్తం చేశారు.
భారత్ భూభాగంలోకి చైనా చొరబాట్లు పెరుగుతున్నా ప్రధాని చోద్యం చూస్తున్నారని ఆరోపించారు. ప్రధాని మోదీకి సంబంధించి ఐదు సత్యాలంటూ రాహుల్ ట్వీట్ చేశారు. ప్రధాని మోదీ డ్రాగన్ను చూసి బెంబేలెత్తుతున్నారని, వాస్తవాలను ప్రజల నుంచి దాస్తున్నారని అన్నారు. మోదీ కేవలం తన ఇమేజ్ను కాపాడుకోవడానికి పాకులాడుతున్నారని ఎద్దేవా చేశారు.
ప్రధాని తీరుతో సైన్యం నైతిక స్ధైర్యం దెబ్బతీస్తున్నారని, దేశ భద్రతతో చెలగాటమాడుతున్నారని ఈ ట్వీట్లో మోదీపై తీవ్ర ఆరోపణలు గుప్పించారు. సరిహద్దుల్లో చైనా దళాలు భారత భూభాగంలోకి చొచ్చుకువచ్చి ఆక్రమణకు పాల్పడుతున్నా మన భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడంలో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలూ చేపట్టడం లేదని కాంగ్రెస్ గత కొద్దికాలంగా ఆరోపణలు గుప్పిస్తోంది. గత రెండేండ్లుగా నియంత్రణ రేఖ వెంబడి భారత్, చైనా సేనల మధ్య ప్రతిష్టంభన నెలకొంటోంది.