న్యూఢిల్లీ : అగస్టా డీల్‌లో అవినీతి మరక అంటిన ఇటలీ డిఫెన్స్ దిగ్గజం ఫిన్మెకానికా సబ్సిడరీ లియోనార్డో స్పాపై విధించిన నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం ఎత్తివేయడంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మోదీ సర్కార్ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. గతంలో అగస్టా అవినీతిలో మునిగిపోగా బీజేపీ లాండ్రీలో ఇప్పుడది పరిశుభ్రంగా తేలిందని రాహుల్ తన ట్విటర్ ఖాతాలో రాసుకొచ్చారు. జీ20 సదస్సు నేపధ్యంలో ఇటలీ ప్రధానితో ప్రధాని మోదీ సమావేశమైన కొద్దిరోజులకే ఈ కంపెనీ నుంచి పరికరాల సేకరణపై విధించిన నిషేధాన్ని ఎత్తివేశారు.
అగస్టా వంటి భారీ కుంభకోణంలో ఆరోపణలు వచ్చిన సంస్ధతో వాణిజ్యానికి ఎందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించిందని కాంగ్రెస్ ప్రతినిధి రణ్‌దీప్ సుర్జీవాలా ప్రశ్నించారు. ఈ కంపెనీని ప్రధాని అవినీతి సంస్ధగా అభివర్ణించగా హోంమంత్రి ఈ కంపెనీ బోగస్ అన్నారని, 2014లో బ్లాక్‌లిస్ట్‌లో పెట్టిన అగస్టా, ఫిన్మెకానికాలపై ఇప్పుడు నిషేధం ఎత్తివేశారని ఆయన ఆక్షేపించారు.