న్యూఢిల్లీ : పేదలకు ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు నిరాకరించినందునే కెప్టెన్ అమరీందర్ సింగ్‌ను పంజాబ్ సీఎంగా తొలగించామని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ గురువారం ఫతేఘఢ్ సాహిబ్‌లో జరిగిన ర్యాలీని ఉద్దేశించి మాట్లాడారు. విద్యుత్ సరఫరా కంపెనీలతో తనకు సంబంధాలున్నాయని కెప్టెన్ సింగ్ తనతో చెప్పారని రాహుల్ అన్నారు. మరోవైపు కేంద్రంలోని బీజేపీ కనుసన్నల్లో రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుండటంతోనే కెప్టెన్ సింగ్‌పై వేటు వేశామని అంతకుముందు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ పేర్కొన్నారు. అమరీందర్ సింగ్ పేరు ప్రస్తావించకుండానే పంజాబ్ సర్కార్ పెడదారిన పయనిస్తోందని తమకు తెలియడంతోనే నాయకత్వాన్ని మార్చామని ఆమె చెప్పుకొచ్చారు.
ఇక అంతకుముందు పంజాబ్ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ యూపీ, బిహార్ నేతలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపడంతో ప్రియాంక దిద్దుబాటు చర్యలు చేపట్టారు. చన్నీ వ్యాఖ్యలను తప్పుగా అర్ధం చేసుకున్నారని వివరణ ఇచ్చారు. పంజాబ్‌ను పంజాబీలే పాలించాలని మాత్రమే చన్నీ అన్నారని ఆమె పేర్కొన్నారు. చన్నీ ప్రకటనను తప్పుగా అర్ధం చేసుకున్నారని యూపీ నుంచి ఏ ఒక్కరూ పంజాబ్‌కు వచ్చి ఆ రాష్ట్రాన్ని పాలించాలని కోరుకుంటారని తాను అనుకోనని అన్నారు. పంజాబీల బాగు కోసం పనిచేసే సుస్దిర, పటిష్ట ప్రభుత్వం అవసరమని పేర్కొన్నారు.
సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఆందోళన చేపట్టిన సమయంలో ముఖం చూపించని ప్రధాని మోదీ ఎన్నికల సమయంలో పంజాబ్ పర్యటనలకు వస్తున్నారని ఆమె ఎద్దేవా చేశారు. ధరల పెరుగుదల, నిరుద్యోగం ప్రబలుతున్నా మోదీ నోరు మెదపడం లేదని మండిపడ్డారు. పంజాబ్‌లో కాంగ్రెస్ ప్రభంజనం కనిపిస్తోందని ప్రియాంక గాంధీ ధీమా వ్యక్తం చేశారు.ఇక ఫిబ్రవరి 20న ఒకే దశలో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా కాంగ్రెస్, ఆప్, ఎస్ఏడీ, బీజేపీ-పీఎల్సీ కూటమిలు ప్రధానంగా తలపడుతున్నాయి.