Rahul Gandhi | లోక్సభ ఎన్నికల్లో ప్రజాతీర్పును గౌరవిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ప్రధాని నరేంద్ర మోదీకి, బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ అని వ్యాఖ్యానించారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న నేపథ్యంలో మంగళవారం ఆయన ఏఐసీసీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి కేవలం ఒక రాజకీయ పార్టీకి వ్యతిరేకంగా పోరాడలేదని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. బీజేపీతోపాటు పరిపాలనా వ్యవస్థలు, ఇంటెలిజెన్స్ సంస్థలు, సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)లతోనూ పోరాడాల్సి వచ్చిందన్నారు. ప్రధాని మోదీ, గౌతం అదానీ మధ్య సంబంధాన్ని ప్రజలు సరిగ్గానే అర్ధం చేసుకున్నారన్నారు.