న్యూఢిల్లీ : స్వాతంత్ర్య వజ్రోత్సవ వేడుకల నేపధ్యంలో గుజరాత్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బిల్కిస్ బానో రేపిస్టులను జైలు నుంచి విడుదల చేయడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో మహిళలను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన ఉపన్యాసానికి ఆయన చేస్తున్న దానికి పొంతన లేదని యావత్ దేశం గమనిస్తోందని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ః గాంధీ దుయ్యబట్టారు.
2002లో గుజరాత్ అల్లర్ల సమయంలో బిల్కిస్ బానో అనే మహిళపై గ్యాంగ్ రేప్ జరిగింది. అయిదు నెలల ప్రెగ్నెంట్ మహిళను దాహోద్ జిల్లాలో అత్యాచారం చేశారు. ఆమె కుటుంబానికి చెందిన ఏడుగురిని హతమార్చారు. ఆ ఘటనలో 11 మందికి యావజ్జీవ ఖైదు విధించారు. అయితే 75వ స్వాతంత్య్ర దినోత్సవం నేపథ్యంలో ఆ రేపిస్టులను గుజరాత్ ప్రభుత్వం గోద్రా సబ్జైలు నుంచి విడుదల చేసింది.
ఎర్రకోట నుంచి ప్రధాని చేసిన ప్రసంగంలో మహిళలను చూసే దృక్కోణం మారాలని, వారిని గౌరవించాలని దేశ ప్రజలను కోరారు. అయితే రేపిస్టులను విడుదల చేస్తూ ఆయన చేతల్లో అందుకు విరుద్ధంగా వ్యవహరించారని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. మరోవైపు బిల్కిస్ బానో కేసులో దోషులను విడుదల చేయడం పట్ల కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ విస్మయం వ్యక్తం చేశారు. గర్భిణిపై సామూహిక లైంగిక దాడి, హత్యకు పాల్పడి అన్ని కోర్టుల్లో దోషులుగా తేలినవారిని విడుదల చేయడం అన్యాయానికి పరాకాష్ట కాదా అని ఆమె ప్రశ్నించారు. మహిళలను గౌరవించడం ప్రసంగాలకే పరిమితమా అని ప్రధాని నరేంద్ర మోదీని ఆమె నిలదీశారు.