Rahul Gandhi | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై 25శాతం సుంకాలు విధించడంపై కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీపై మండిపడ్డారు. ట్రంప్ 30-32 సార్లు కాల్పుల విరమణపై ప్రకటన చేరశారని.. ఐదు భారతీయ జెట్ విమానాలు కూలిపోయాయని వ్యాఖ్యానించారన్నారు. ట్రంప్ తాజాగా సుంకాలు విధిస్తామని చెబుతున్నారని.. అయినా ప్రధాని నరేంద్ర మోదీ ఎందుకు సమాధానం చెప్పలేకపోతున్నారని ప్రశ్నించారు. దీని వెనుక అసలు కారణాలు ఏంటీ? ఆయనపై ఎవరి నియంత్రణ ఉంది? విదేశాంత మంత్రి ప్రసంగాలు చేస్తూ.. దేశ విదేశాంగ విధానం ఆకట్టుకుంటుందని చెబుతున్నారని విమర్శించారు. ఓ వైపు అమెరికా.. మరో వైపు చైనా వెంట పడుతోందని.. ప్రతినిధి బృందాలను పంపినా ఓ దేశం పాకిస్తాన్ వైఖరిని ఖండించలేదన్నారు.
దేశాన్ని ఎలా పరిపాలిస్తున్నారంటూ నిలదీశారు. పూర్తిగా గందరగోళ పరిస్థితి ఉందని.. మోదీ తన ప్రసంగంలో చైనా, ట్రంప్ పేర్లను ప్రస్తావించలేదని.. పాకిస్తాన్ సైనిక అధిపతితో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భోజనం చేస్తున్నారని.. తాము గొప్ప విజయం సాధించామని ప్రధాని చెబుతున్నారంటూ విమర్శలు గుప్పించారు. భారత ఆర్థిక వ్యవస్థ క్షీణించిందని ట్రంప్ చేసిన వ్యాఖ్యలు నిజమేనని రాహుల్ గాంధీ అన్నారు. ఈ విషయం ప్రధాని, ఆర్థిక మంత్రికి తప్ప అందరికీ ఈ విషయం తెలుసునన్నారు. ఈ విషయంలో ట్రంప్ వాస్తవాలు చెప్పినందుకు సంతోషంగా ఉందన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ క్షీణిస్తుందని ప్రపంచమంతా తెలుసునని.. అదానీకి సహాయం చేసేందుకు బీజేపీ ప్రభుత్వం దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేసిందన్నారు. మోదీ ఒకే వ్యక్తి పని చేస్తారని.. ఆ వ్యక్తి అదానీ మాత్రమేనన్నారు.