Rahul Gandhi : దేశ రాజధాని ఢిల్లీ (Delhi) లో రాజకీయ కలకలం రేగింది. కాంగ్రెస్ అగ్రనేత (Congress top leader), లోక్‌సభ (Lok Sabha) లో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi) ‘కనిపించడం లేదు’ (మిస్సింగ్) అంటూ ఆదివారం ఢిల్లీలోని పలు కీలక ప్రాంతాల్లో వెలిసిన పోస్టర్లు రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. రాహుల్‌గాంధీ తాజా విదేశీ పర్యటనను లక్ష్యంగా చేసుకుని అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య సాగుతున్న పొలిటికల్ వార్‌లో ఈ పరిణామం సరికొత్త మలుపు తిప్పింది.
ఢిల్లీలోని ఫిరోజ్‌షా రోడ్డుతోపాటు పలు ప్రధాన కూడళ్లలో రాహుల్‌గాంధీ ఫొటోతో కూడిన ‘మిస్సింగ్’ పోస్టర్లు ప్రత్యక్షమయ్యాయి. అయితే ఈ పోస్టర్లను ఎవరు అంటించారనేది ప్రస్తుతానికి స్పష్టంగా తెలియరాలేదు. పార్లమెంట్ సమావేశాలు, కీలక ఎన్నికలు, లేదా పార్టీ అంతర్గత ప్రాముఖ్యత కలిగిన సమయాల్లో రాహుల్‌గాంధీ దేశంలో ఉండరంటూ శనివారం నుంచే బీజేపీ తన విమర్శల పదును పెంచిన మరుసటి రోజే ఈ పోస్టర్లు కలకలం రేపడం గమనార్హం.
ఈ అంశంపై బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా కాంగ్రెస్ ఎంపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాహుల్‌గాంధీ లోక్‌సభలో ప్రతిపక్ష నేత పదవిని ‘లీడర్ ఆఫ్ పర్యటన్ అండ్ పార్టీయింగ్’ గా మార్చేశారని ఎద్దేవాచేశారు. పార్లమెంట్ నడుస్తున్నప్పుడు లేదా దేశానికి, సొంత పార్టీకి ఆయన అవసరం ఉన్నప్పుడల్లా విదేశాలకు వెళ్లడం రాహుల్‌కు అలవాటుగా మారిందని, ప్రజల కంటే ఆయన టూరిజానికే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపించారు.