న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా ప్రత్యేక హక్కుల ఉల్లంఘన తీర్మానాన్ని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. రాహుల్ గాంధీ బుధవారం పార్లమెంట్లో ప్రసంగం సందర్భంగా ప్రజలను రెచ్చగొట్టేలా మాట్లాడారని ఆయన ఆరోపించారు. ‘రాష్ట్రాల యూనియన్ అంటే భాగస్వామ్యం, రాజ్యం కాదు’ అన్న రాహుల్ వ్యాఖ్యలను తప్పుపట్టారు. రాహుల్‌ను స్క్రిప్ట్ రీడర్, డ్రాయింగ్ రూమ్ పొలిటీషియన్ అని దూబే విమర్శించారు. రాజ్యాంగాన్ని ఆయన తప్పుగా అర్థం చేసుకున్నారని అన్నారు. రాజ్యాంగం పీఠికను కూడా ఆయన చదవలేదని దుయ్యబట్టారు.
పీఠికలో రిపబ్లిక్ అనే పదాన్ని ఉపయోగించడం ద్వారా, భారతదేశం అన్ని విధాలుగా ఒక దేశమని రాజ్యాంగం స్పష్టం చేస్తున్నదని నిషికాంత్ దూబే తెలిపారు. ‘రాహుల్ గాంధీ ఒక అనుభవజ్ఞుడైన పార్లమెంటేరియన్. ఈ సాధారణ విషయాన్ని ఆయన అర్థం చేసుకోకపోవడం చాలా దురదృష్టకరం’ అని వ్యాఖ్యానించారు. దేశానికి వ్యతిరేకంగా ఏదో రకంగా విధ్వంసక కార్యకలాపాలకు పాల్పడేటట్లుగా ప్రజలను రెచ్చగొట్టాలనే ఏకైక ఉద్దేశంతో తప్పుడు, అశాస్త్రీయమైన అంశాలపై రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారని ఆరోపించారు.
రాహుల్ గాంధీ బుధవారం చేసిన ప్రసంగం, ఇతర చట్ట సభలతోపాటు పౌరులను కూడా ప్రేరేపిస్తున్నదని దూబే విమర్శించారు. ఇది ప్రత్యేక హక్కుల ఉల్లంఘన, సభను ధిక్కరించడం కిందకు వస్తుందని అన్నారు. దీంతో సంబంధిత సహా నియమ నిబంధనల ప్రకారం రాహుల్ గాంధీపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.