Rahul Gandhi | న్యూఢిల్లీ/వయనాడ్, జూన్ 17: ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో రెండు స్థానాల్లో పోటీచేసి గెలిచిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేరళలోని వయనాడ్ స్థానాన్ని వదులుకోవాలని నిర్ణయించారు. ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ ఎంపీగా ఆయన కొనసాగుతారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సోమవారం వెల్లడించారు. వయనాడ్ నుంచి ఉప ఎన్నికల్లో ప్రియాంక గాంధీ పోటీచేస్తారని తెలిపారు.
ఈ మేరకు ఖర్గే నివాసంలో జరిగిన కాంగ్రెస్ అగ్రనేతల చర్చల అనంతరం రాహుల్ మీడియాతో మాట్లాడారు. తనకు రాయ్‌బరేలీ, వయనాడ్‌తో భావోద్వేగ సంబంధాలు ఉన్నాయని, ఇది తనకు చాలా కష్టమైన నిర్ణయమని అన్నారు. కష్ట సమయాల్లో వయనాడ్ ప్రజలు తనకు మద్దతుగా నిలిచారని, పోరాడేందుకు శక్తి ఇచ్చారని పేర్కొన్నారు.
ఇకపై కూడా వయనాడ్‌కు తరచూ వెళ్తానని, నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కృషి చేస్తానని చెప్పారు. ప్రియాంక గాంధీ మాట్లాడుతూ రాహుల్ అక్కడ లేరనే భావనను వయనాడ్ ప్రజలకు కలుగనివ్వనని పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం రెండు లోక్‌సభ స్థానాల నుంచి గెలిచిన వాళ్లు.. ఫలితాల వెల్లడి తర్వాత 14 రోజుల్లోగా ఏదొక స్థానాన్ని వదులుకోవాల్సి ఉంటుంది.
కాగా, రాహుల్ వయనాడ్ స్థానాన్ని వదుకోవడంపై కేరళ బీజేపీ అధ్యక్షుడు కే సురేంద్రన్ విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ తమ రాష్ర్టాన్ని ఒక రాజకీయ ఏటీఎంగా భావిస్తున్నదని, వయనాడ్ ప్రజలను రాహుల్ మోసం చేశారని సురేంద్రన్ ఆరోపించారు.