దాదాపు రెండు సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తన సొంత నియోజకవర్గమైన అమేథీ పర్యటనకు వెళ్లనున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో అమేథీ నుంచి పోటీ చేసి, ఓడిపోయారు. బీజేపీ అభ్యర్థి, ప్రస్తుతం కేంద్రమంత్రిగా ఉన్న స్మృతి ఇరానీ చేతిలో రాహుల్ ఓడిపోయారు. అయితే రాహుల్ రెండు నియోజకవర్గాల నుంచి బరిలోకి దిగారు. ఒకటి పరంపరాగతంగా వస్తున్న అమేథీ కాగా, రెండోది కేరళలోని వాయనాడ్ నుంచి. అమేథీ నియోజకవర్గంలో ఓడిపోయి, వాయనాడ్‌లో మాత్రం బంపర్ మెజారిటీతో గెలిచిన విషయం తెలిసిందే. జన జాగరణ కార్యక్రమంలో భాగంగా ఎంపీ రాహుల్ గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అమేథీలో జరిగే ఓ ర్యాలీలో పాల్గొంటారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ ధృవీకరించింది.
ఇక ఈ నెల 16 న డెహ్రాడూన్‌లోనూ రాహుల్ పర్యటిస్తారు. అక్కడ జరిగే ర్యాలీలో పాల్గొంటారు. ఈ నెల 12న జైపూర్‌లో జరిగిన ర్యాలీలో కూడా రాహుల్ పాల్గొన్నారు. కేంద్రంపై విరుచుకుపడ్డారు. అయితే అందరి కళ్లు మాత్రం అమేథీపైనే ఉన్నాయి. స్మృతీ ఇరానీ చేతిలో ఓడిపోయిన తర్వాత రాహుల్ ఇప్పటి వరకూ అమేథీ మొహం చూడనేలేదు. చాలా రోజుల తర్వాత మళ్లీ రాహుల్ సొంత నియోజకవర్గ పర్యటనకు బయల్దేరుతున్నారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ పేరు దాదాపుగా ఖాయమైందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మళ్లీ సొంత నియోజకవర్గ పర్యటనకు వెళ్తుండటం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.