TVK Vijay : తమిళనాడులో నటుడు విజయ్ స్థాపించిన టీవీకే, కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తాయనే ప్రచారంలో నిజం లేదా..? తాజాగా తమిళనాడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కె.సెల్వపెరుంతగై స్పందించిన తీరే ఇందుకు నిదర్శనం. తమకు టీవీకేతో పొత్తు అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. తమ పార్టీకి రాహుల్ గాంధీయే బూస్ట్, హార్లిక్స్ అంటూ వ్యాఖ్యానించారు. ఇటీవల విజయ్ తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్తో కలిసి సాగేందుకు సిద్ధమని ప్రకటించారు.
‘‘కాంగ్రెస్ పార్టీకి ఒక చరిత్ర, వారసత్వం ఉంది. ఆ పార్టీ పునర్వైభవానికి మద్దతిచ్చేందుకు విజయ్ సిద్దంగా ఉన్నారు. ఈ అవకాశాన్ని వాడుకోవాలో వద్దో అనేది కాంగ్రెస్ చేతిలోనే ఉంది. తమిళనాడులో ఆ పార్టీ రాజకీయంగా పుంజుకోవడానికి ఇబ్బందులు పడుతోంది’’ అని చంద్రశేఖర్ వ్యాఖ్యానించారు. అయితే, ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ తమిళనాడు చీఫ్ కె.సెల్వపెరుంతగై స్పందించారు. విజయ్ ప్రతిపాదనను తిరస్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘ఒక్కసారి మా పార్టీ కార్యకర్తల్ని చూడండి. వాళ్లకు ఇప్పటికే చాలా ఉత్సాహంగా ఉన్నారు. మా పార్టీకి అవసరమైన బూస్ట్, హార్లిక్స్, బోర్నవిటా ఇవ్వడానికి రాహుల్ గాంధీ ఉన్నారు’’ అని అన్నారు. అంటే ప్రస్తుతానికి టీవీకేతో పొత్తు ఆలోచన లేదని ఆయన చెప్పారు.
మరోవైపు ఈ అంశంపై అటు టీవీకే తరఫున విజయ్, ఇతర పార్టీ నేతలు స్పందించలేదు. ఇక.. ఎంతోకాలంగా డీఎంకేతో పొత్తులో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఈసారి ఆ అవకాశం లేనట్లు కనిపిస్తోంది. కాంగ్రెస్తో పొత్తు విషయంలో డీఎంకే అంత సుముఖంగా లేదు. అలాగని కాంగ్రెస్ కూడా సొంతంగా పెద్దగా ప్రభావం చూపే అవకాశం లేదు. ప్రస్తుత తరుణంలో కాంగ్రెస్ ఎవరితో ఒకరితో పొత్తు పెట్టుకోవాల్సిందే.