Rahul Gandhi | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, మార్చి 24 (నమస్తే తెలంగాణ): వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాక్ తగిలింది. ఆ పార్టీ అగ్ర నాయకుడు, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేస్తూ లోక్‌సభ సచివాలయం శుక్రవారం కీలక నిర్ణయం తీసుకొన్నది. పరువు నష్టం కేసులో గుజరాత్‌లోని సూరత్ కోర్టు రాహుల్‌కు రెండేండ్ల పాటు జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చిన మరుసటి రోజే.. లోక్‌సభ సచివాలయం ఈ మేరకు నిర్ణయం తీసుకోవడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారిం ది. ‘కేరళలోని వయనాడ్ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రాహుల్ గాంధీని కోర్టు దోషిగా ప్రకటించింది. తీర్పు చెప్పిన తేదీ (23 మార్చి, 2023) నుంచి ఆయన లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దుచేస్తున్నాం’ అని లోక్‌సభ సచివాలయం నోటిఫికేషన్లో పేర్కొంది. భారత రాజ్యాంగంలోని ప్రజాప్రాతినిధ్య చట్టం-1951లోని సెక్షన్ 8 ప్రకారం.. ఆర్టికల్ 102(1)(ఈ)లోని నిబంధనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు సెక్రటేరియట్ వెల్లడించింది.
2019 ఎన్నికల సందర్భంగా కర్ణాటకలోని కోలార్‌లో రాహుల్ మాట్లాడుతూ.. ‘దొంగలంతా మోదీ ఇంటి పేరు ఎందుకు పెట్టుకుంటారు?’ అని అన్నారు. ఈ మేరకు నీరవ్ మోదీ, లలిత్ మోదీ, నరేంద్ర మోదీ అంటూ పలు పేర్లను ఉదహరించారు. దీనిపై సూరత్ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ రాహుల్‌పై పరువు నష్టం కేసు వేయగా, గురువారం సూరత్ కోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా తాను ఆ వ్యాఖ్యలు చేయలేదని రాహుల్ గాంధీ వివరణ ఇచ్చారు. కానీ, రాహుల్ ఆ వ్యాఖ్యలు చేశారని కోర్టు నిర్ధారించి, ఐపీసీ సెక్షన్ 499, 500 ప్రకారం.. దోషిగా తేల్చింది. రెండేండ్ల జైలు శిక్ష విధించింది. ఆ వెంటనే ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ, పై కోర్టులో అప్పీల్ చేసుకునేందుకు శిక్షను 30 రోజుల పాటు నిలిపివేసింది. ఇంతలో రాహుల్ లోక్‌సభ సభ్యత్వాన్ని సచివాలయం రద్దుచేసింది.
ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 సెక్షన్ 8లోని ఆర్టికల్ 102(1)(ఈ) నిబంధన ప్రకారం రెండేండ్లు లేదా అంతకంటే ఎక్కువ జైలుశిక్ష పడిన వ్యక్తి తీర్పు వెలువడిన తేదీ నుంచి రాజ్యాంగ పదవుల్లో ఉండటానికి అర్హత కోల్పోతారు. జైలు శిక్షాకాలంతోపాటు మరో ఆరేండ్లపాటు ఎన్నికల్లో పోటీ చేసేందుకూ అనర్హులవుతారు. సెక్షన్ 8లో పేర్కొన్న నేరాలకు ఈ అనర్హత వేటు వర్తిస్తుంది.
ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం పై కోర్టులో అప్పీల్ చేసినప్పటికీ, రాహుల్‌కు సానుకూలంగా తీర్పు రాకపోతే, మొత్తం 8 ఏండ్లపాటు (రెండేండ్ల జైలు శిక్షతో పాటు ఆరేండ్ల నిషేధం) ఆయన ఎన్నికల్లో పోటీచేయకూడదు. ఈ లెక్కన 2024లో జరుగనున్న సార్వత్రిక ఎన్నికలకు ఆయన దూరంకావొచ్చు. అయితే, పై కోర్టు ఇచ్చే తీర్పుపైనే ఇది ఆధారపడి ఉంటుంది.
Rahul Gandhi
మోదీ ఇంటి పేరును కించపరిచేలా చేసిన వ్యాఖ్యలకుగానూ రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు రెండేండ్ల జైలుశిక్ష విధించింది. అయితే, ఇదే సమయంలో.. ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ, పై కోర్టులో అప్పీల్ చేసుకునేందుకు శిక్షను 30 రోజుల పాటు నిలిపివేసింది. ఇంతలో ఆయనపై లోక్‌సభ సచివాలయం అనర్హత వేటు వేసింది. అయినప్పటికీ, కేసు విషయంలో అప్పీలుకు వెళ్లేందుకు రాహుల్‌కు 30 రోజులు గడువు ఉన్నది. ఒకవేళ పై కోర్టు కింది కోర్టు ఆదేశాలపై స్టే విధించినా.. లేక, ఆ ఆదేశాలను రద్దు చేసినా.. రాహుల్‌పై అనర్హత వేటు రద్దు అవుతుంది. ఈ మేరకు లక్షద్వీప్ ఎంపీ మొహమ్మద్ ఫైజల్ కేసును న్యాయనిపుణులు ఉదహరిస్తున్నారు. అనర్హత వేటు రద్దు ప్రక్రియపై 2018నాటి లోక్‌ప్రహారీ వర్సెస్ భారత ప్రభుత్వం కేసులో సుప్రీంకోర్టు కూడా స్పష్టతనిచ్చింది. అప్పిలేట్ కోర్టు స్టే ఉత్తర్వులు జారీ చేసిన తేదీ నుంచి అనర్హత వేటు రద్దు అవుతుందని సుప్రీం వివరించింది. అప్పీల్ పెండింగ్‌లో ఉంటే అప్పిలేట్ కోర్టు దోషికి పడిన శిక్షను సస్పెండ్ చేయవచ్చు. ఇది అప్పీల్దారుని బెయిల్‌పై విడుదల చేయటం వంటిది. తనపై సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పును రాహుల్‌గాంధీ తొలుత సూరత్ సెషన్స్ కోర్టులో సవాల్ చేయాల్సి ఉంటుంది. అటు తర్వాత హైకోర్టుకు వెళ్లవచ్చు.
ఓ హత్యాయత్నం కేసులో ఎంపీ మొహమ్మద్ ఫైజల్‌ను సెషన్స్ కోర్టు దోషిగా తేల్చింది. దీంతో గత జనవరిలో తన పార్లమెంట్ సభ్యత్వాన్ని కోల్పోయారు. ఆ వెంటనే కేంద్ర ఎన్నికల కమిషన్ లక్ష్యద్వీప్ స్థానానికి ఉప ఎన్నిక ప్రకటించింది. అనంతరం కేరళ హైకోర్టు స్టే విధించటంతో మళ్లీ ఆయన సభ్యత్వాన్ని పునరుద్ధరించాలని న్యాయశాఖ సిఫారసు చేసింది. పదునైన ఆయుధాలతో చంపే యత్నం చేశారనేందుకు ఆధారాల్లేవని, ఒకవేళ అదే గనక జరిగితే ఆ విషయం నిరూపించాల్సిన బాధ్యత ప్రాసిక్యూషన్ వారిపై ఉందంటూ పేర్కొన్న ధర్మాసనం ఫైజల్‌పై పేర్కొన్న హత్యాయత్నం ఆరోపణలను కొట్టేసింది. దాంతో ఫైజల్‌పై అనర్హత వేటు రద్దయ్యింది. ఏడాదిన్నరలోపు 2024 సార్వత్రిక ఎన్నికలు రానున్న నేపథ్యంలో.. సదరు ప్రజాప్రతినిధిపై అనర్హత వేటు విధించి..తద్వారా ఉప ఎన్నికలు జరపటం ప్రజాధనం వృధా చేయటమేనని హైకోర్టు న్యాయమూర్తి కురియన్ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.